NEET PG Exam EWS Quota: నీట్ పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన పిటిషన్ విచారణ జనవరి ఆరో తేదీన జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వచ్చే సంవత్సరం సవరణలు చేస్తామని తెలిపింది.
ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తున్నామని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.
సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు.. గతేడాది నవంబర్ 30న కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఐసీఎస్ఎస్ఆర్ మెంబర్ సెక్రటరీ వీకే మల్హోత్రా, కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ సభ్యులు. గతేడాది డిసెంబర్ 31న కమిటీ తమ నివేదికను సమర్పించింది.
కమిటీ నివేదిక ప్రకారం..
- రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలుగా కొనసాగనుంది.
- ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు.
- ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది.
కౌన్సెలింగ్ ఆలస్యంపై సమ్మె..
NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యంపై ఇటీవల రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. 14 రోజుల అనంతరం విరమించారు.
తొలుత నవంబర్ 27న నిరసనకు దిగారు. అనంతరం.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే డాక్టర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో వారిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమ్మె బాట పట్టారు.
దిల్లీ పోలీస్ కమిషనర్‌తో సమావేశం అనంతరం డిసెంబర్ 31న సమ్మె విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిరసనలకు సంబంధించి వైద్యులపై ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై పోలీస్ అధికారి హామీ ఇచ్చిన నేపథ్యంలో.. సమ్మెను ఆపారు.
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2022 జనవరి 6లోపు ప్రారంభం అవుతుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్ ప్రసాద్ సింగ్. వైద్యులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు ఉండబోవని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: Financial problems: నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు.. స్తోమత లేక ఇంటికే పరిమితం!
NEET Suicide In Tamil Nadu: నీట్ పరీక్షలో ఫెయిల్- విద్యార్థిని ఆత్మహత్య