Resident doctors protest: నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యంపై రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనల ఫలితంగా దిల్లీలోని రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు బుధవారం అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఆందోళనల్లో రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) సభ్యులు భారీగా పాల్గొంటున్నారు.
NEET PG counselling: సోమవారం నాటి ఆందోళనలో వైద్యులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ... తాము సేవలను బహిష్కరిస్తున్నామని దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి(ఆర్జీఎస్ఎస్హెచ్) చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. నీట్-పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేసింది.
"సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నారు. అయితే... మేం రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని ఆర్జీఎస్ఎస్హెచ్కు చెందిన ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. రోజూ 900 నుంచి 2000 మంది రోగులు తమ ఆస్పత్రిలోని ఔట్పేషంట్ విభాగానికి వస్తారని చెప్పారు.
Delhi Doctors stir: ఆర్డీఏ సభ్యులతో పాటు చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ, ఉత్తర రైల్వే కేంద్ర ఆస్పత్రి వైద్యులు కూడా సేవలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
బుధవారంతో... వైద్యులు చేపట్టిన నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. 'మా సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది' అని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) అధ్యక్షుడు డాక్టర్ మనీశ్ కుమార్ స్పష్టం చేశారు.
వైద్యులు లేక విలవిల..
Delhi hospitals: వైద్యుల సమ్మె కారణంగా... సఫ్దార్జంగ్, ఆర్ఎంఎల్, లేడీ హార్దింగ్ సహా దిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వివిధ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించే విభాగంలో వైద్యుల కొరత ఎదురవుతోంది.
సోమవారం తరహాలో మళ్లీ ఉద్రిక్త ఘటనలు జరగకుండా నివారించేందుకు పెద్దఎత్తున పోలీసు సిబ్బందిని వివిధ ఆస్పత్రుల వద్ద బుధవారం మోహరించారు. మరోవైపు.. దిల్లీలో కరోనా వ్యాప్తి దృష్ట్యా 'ఎల్లో అలర్ట్' విధించిన నేపథ్యంలో వైద్యులంతా కరోనా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
నిరసన వీడండి..
వైద్యులు నిరసనను వీడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైద్యులతో నిర్మాణ్ భవన్లో సమావేశం నిర్వహించారు. నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై నమోదైన కేసులో కేంద్రం గడువులోగా అవిడవిట్ను దాఖలు చేస్తుందని తెలిపారు. సమస్య పరిష్కారానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కౌన్సిలింగ్ ఇప్పుడే నిర్వహించలేమని అన్నారు. కరోనా పరిస్థితుల్లో వైద్యుల సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: Doctors protest: రెసిడెంట్ డాక్టర్ల నిరసనలు మరింత తీవ్రం
ఇదీ చదవండి: పోలీసుల దాడిపై వైద్యుల నిరసన.. క్యాంపస్లో మళ్లీ ఉద్రిక్తత!