జూన్లో సుమారు 12 కోట్ల కొవిడ్ టీకా(Covid vaccine) డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మే నెలలో 7.94 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. టీకాల వినియోగం, జనాభా, వ్యాక్సిన్ వృథా వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలు, కేంద్ర ప్రాలిత ప్రాంతాలకు టీకాల సరఫరా ఉంటుందని ప్రకటించింది.
" 2021, జూన్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉండే టీకాల వివరాలు ముందుగానే అందించాం. జూన్లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందించేందుకు 6.09 కోట్ల డోసులను సరఫరా చేయనున్నాం. వాటికి అదనంగా 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా జూన్లో 12 కోట్ల డోసులు అందనున్నాయి. "
- కేంద్ర ఆరోగ్య శాఖ.
టీకా డోసుల రవాణా, డెలివరీ షెడ్యూల్ను ముందుగానే రాష్ట్రాలకు తెలియజేస్తామని పేర్కొంది ఆరోగ్య శాఖ. కేటాయించిన డోసులు హేతుబద్ధంగా, న్యాయంగా వినియోగించుకుంటూ వృథాను తగ్గించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాలకు అందే టీకాల గురించి ముందుగా తెలియజేయడంలో ఉద్దేశం కూడా అదేనని పేర్కొంది. మేలో 4.03 కోట్ల ఉచిత టీకా డోసులను రాష్ట్రాలకు కేంద్రం అందించినట్లు పేర్కొంది. వాటితో పాటు 3.90కోట్ల డోసులు రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసేలా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
శనివారం ఒక్కరోజే 30,35,749 వ్యాక్సిన్ డోసులు(Covid vaccine) అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,20,66,614కు చేరినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 12 ఏళ్లకే 'టోఫెల్' ఉత్తీర్ణత- కశ్మీర్ బాలిక ఘనత