Naveen Murder Case Latest Updates: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కీలక అంశాలపై దృష్టి సారించారు. నిందితుడు హరిహరకృష్ణ నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఎవరెవర్ని కలిశాడనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగానే నవీన్ హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 12.20 గంటల వేళ తనుకు హరిహర ఫోన్ చేసి ఇంట్లో నుంచి బయటకు రమ్మన్నాడని హసన్ పోలీసులకు వివరాలను చెప్పారని సమాచారం.
Abdhullapurmet murder case latest news : "అర్ధరాత్రి హరిహరకృష్ణ ఫోన్ చేయడంతో నేను ఇంట్లో నుంచి బయటకొచ్చి ఈ సమయంలో ఎందుకొచ్చావని ప్రశ్నించగా.. హరిహర మన మిత్రుడు నవీన్‌ను హత్యచేసినట్లు తెలిపాడు. మార్గమధ్యలో నవీన్ శరీర భాగాలను కూడా పడేశానని బదులిచ్చాడు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపొమ్మని చెప్పా.అవేవీ పట్టించుకోకుండా ఒక జత దుస్తులు కావాలని కోరాడు. విధి లేక నేను విడిచేసిన దుస్తులు ఇవ్వగా స్నానం చేసి వాటినే వేసుకున్నాడు. హరిహరకృష్ణ తన దుస్తుల్ని ఒక సంచిలో తీసుకుని పోలీసుల ముందు లొంగిపోతానని ఉదయం 3 గంటలకు బయలుదేరాడు. ఆ తర్వాత 24వ తేదీన మరోసారి వచ్చి తనను కలిశాడని హసన్ చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు."
స్నేహితుడు హసన్ ఇంటి నుంచి బయటకెళ్లిన నిందితుడు హరిహరకృష్ణ కొన్ని గంటల తర్వాత ఇదే విషయాన్ని యువతికి చెప్పినట్లు తెలిసింది. తన వాహనంపై తుర్కయాంజల్ మీదుగా హస్తినాపురం చేరుకుని తాను ప్రేమించిన యువతిని ఫోన్ చేసి రహదారిపైకి పిలిపించి హత్య గురించి వివరించాడని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కోన్నారు. హత్య విషయాన్ని చెప్పిన తర్వాత కూడా వారు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఎవరితోనైనా పంచుకున్నాడా: హరిహరకృష్ణ తనమిత్రుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయాన్ని హసన్, యువతి ఇద్దరికీ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఎందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నిందితుడు చెప్పాడా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ వ్యవహారంలో యువతి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ఆమెను సంప్రదించారు. తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దని కోరినట్లు చెబుతున్నారు. నవీన్ అడ్డు తొలగించాలని నిర్ణయించిన హరిహర.. ఈ విషయాన్ని ఎవరితోనైనా పంచుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతనెల 18 తేదీ ఉదయం నుంచి 24 తేదీ వరకూ హరిహరకృష్ణ ఎవరెవర్ని కలిశారో పోలీసులు విచారిస్తున్నారు. ప్రసుత్తం హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు తండ్రి కేవలం తన కూమారుడు ఒకడే హత్య చేయలేడని ఆరోపణలు చేశాడు. ఈకేసులో అనుమానితులు ఉంటే నిందితులుగా చేర్చే అవకాశముందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.