కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై నిరసనల్లో భాగంగా ఈనెల 18న సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన రైల్ రోకోపై రైతు సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు, రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ సోదరుడు నరేశ్ టికాయిత్ తప్పుపట్టారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉండే నిరసనలను తాము సమర్థించమని ప్రకటించారు. సంభల్ జిల్లా సింహపురిసైని ప్రాంతంలో రైతు నేతలతో శుక్రవారం జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించని విధంగా తాము నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.
మా దగ్గర పనిచేయవు..
రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నరేశ్ టికాయిత్ మండిపడ్డారు. కర్షకులను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. రైతుల ముందు కేంద్రం ఎత్తులు పనిచేయవని తెలిపారు. రైతుల తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం కీలక ప్రకటనలు చేసింది.
ఈనెల 14న పుల్వామా ఘటనలో అమరులైన జవానులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన జరపనున్నారు రైతులు. 16న దివంగత నేత ఛోటూరామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ఈనెల 18న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : ఆ ఐదు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం