Nara Bhuvaneshwari Questioned YSRCP Government : 'చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు.. నిరంతరం ప్రజల కోసమే ఆయన ఆరాటపడేవారు.. రాత్రింబవళ్లు కష్టపడే మనిషిని ఎందుకు అరెస్టు చేశారు..?' అని నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదన్న భువనేశ్వరి.. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. అన్నవరంలో సత్యదేవుడిని దర్శించుకున్న భువనేశ్వరి.. ఆ తర్వాత జగ్గంపేటలో టీడీపీ రిలే దీక్ష శిబిరం వద్దకు వెళ్లారు. జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవాళ ఉదయం అన్నవరం (Annavaram) సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఉదయం రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి అన్నవరం క్షేత్రానికి చేరుకున్నారు. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ వరపుల సత్యప్రభ, నాయకుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, చినరాజప్ప తదితరులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సాభ్యులతో కలిసి భువనేశ్వరి సత్యదేవుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. కొద్దిసేపు వినాయక అతిథి గృహంలో గడిపిన తర్వాత జగ్గంపేటలో టీడీపీ (TDP) రిలే దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ భువనేశ్వరీ మీడియా మాట్లాడింది.
చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే ఆరాటపడేవారు.. రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. మద్దతు తెలపడానికి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి వస్తున్న ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలా? అని దుయ్యబట్టారు. శాంతియుత ర్యాలీ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నారు అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలు బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని గుర్తు చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదన్న భువనేశ్వరి.. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసు.. తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం అని తెలిపారు. తాను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నానని, 2 శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయని తెలిపారు. ఏం తప్పు చేశారని ఆయనను జైలులో పెట్టారు.. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు అని భువనేశ్వరి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని, ఎన్టీఆర్ పేరుతో ట్రస్టు (NTR Trust)ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తూ.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చారనిు గుర్తు చేశారు.
చంద్రబాబును భువనేశ్వరి, బ్రాహ్మణి (Brahmani) ఇవాళ కలుసుకోనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బాబును గతంలో ఓసారి ములాఖత్ కాగా.. మళ్లీ ఈ రోజు సాయంత్రం కలవనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి సాయంత్రం 4 గంటలకు ములాఖత్ కానున్నారు.
Chandrababu Bail Petition Hearing: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ