Nandamuri Balakrishna Media Conference : కేవలం రాజకీయ కక్షలో భాగంగానే... ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలన్నదే జగన్ కుట్ర అని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రం భవిష్యత్ ( State Future )కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన తరుణం ఇదే అని చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్న బాలయ్య... 'నేనొస్తున్నా... ఎవరూ భయపడాల్సిన పనిలేదు' అని అన్నారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు.. ఇంకా బాలయ్య ఏమన్నారంటే.. 'జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి... బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలు.. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు... చంద్రబాబు ( Chandrababu )ను 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర ' అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారన్న బాలకృష్ణ.. సీఎం కేవలం పాలసీ మేకర్... అధికారులే అమలు చేస్తారు అని తెలిపారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని వివరించారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసి 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని చెప్పారు. జగన్... ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని బాలకృష్ణ ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్న ఆయన.. న్యాయ పోరాటం కొనసాగిస్తామని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని చెప్పారు.
యువతను గంజాయి మత్తులో ముంచారు... జగన్.. ఉన్న సంస్థలు విధ్వంసం చేసి యువతను గంజాయికి బానిస చేశారని బాలకృష్ణ మండిపడ్డారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు... పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారు.. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అని ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బాలకృష్ణ ( Balakrishna )తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తాం అని స్పష్టం చేశారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం అని అన్నారు. అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారు.. ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అందరూ ధైర్యంగా ఉండాలి.. హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా?.. అవీనితి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అని బాలకృష్ణ ప్రశ్నించారు. అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదన్న బాలకృష్ణ.. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆవేదనకు గురైన ఓ మహిళ బాలకృష్ణను పట్టుకొని బోరున విలపించింది. అందరూ ధైర్యంగా ఉండాలని బాలకృష్ణ ఆమెను ఓదార్చారు. అంతిమంగా న్యాయం.. ధర్మమే గెలుస్తుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.