ఒడిశా మయూర్భంజ్లో కరోనా బాధితులు నేలపైనే పడుకొని ఉన్న వీడియోలు బయటపడటం కలకలం సృష్టించింది. వారి ఒంటిపైన వస్త్రాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగుల పడకలు ఉండటం వీడియోలో కనిపిస్తోంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
విచారణకు ఆదేశం
ఈ దృశ్యాల గురించి తనకేం తెలియదని మయూర్భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ చెప్పుకొచ్చారు. అయితే, ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
అంతకుముందు.. ఈ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు కలెక్టర్ వినీత్. రోగులకు చికిత్స జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. వార్డులలోని రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలోని ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి- హైకోర్టు విచారణ యూట్యూబ్లో లైవ్- చరిత్రలోనే తొలిసారి!