మైసూర్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం సరికొత్త కొవిడ్ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌కు చెందిన లోర్వెన్ బయోలాజిక్స్ ప్రైవేటు సంస్థతో కలిసి ఈ కిట్‌ను రూపొందించింది. ఇది 90 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని.. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాన్నిస్తుందని పరిశోధకులు మైసూర్ మాజీ ఉపకులపతి, ఎయిమ్స్ సభ్యుడు కేఎస్ రంగప్ప తెలిపారు. ఈ కిట్ సాయంతో ఇంటి దగ్గరే లాలాజలం, నాసిక, కఫం ద్వారా కరోనా పరీక్ష చేసుకోవచ్చని పేర్కొన్నారు.
"బార్కోడ్ స్ట్రిప్‌ను యాప్‌తో అనుసంధానించడం ఈ కిట్‌లోని మరో ప్రత్యేకత. బార్కోడ్ స్కాన్ చేసిన వెంటనే రోగి ఆరోగ్య పరిస్థితి (పాజిటివ్ లేదా నెగటివ్) సర్వర్‌లో పొందుపరుస్తుంది. తద్వారా వైద్యులు తక్షణమే బాధితులకు చికిత్స అందించడానికి వీలుంటుంది. ఈ కిట్ తయారీలో మాలిక్యూలర్ బయాలజీ, నానోటెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లోని ఆధునిక సాంకేతికతను ఉపయోగించాం" అని పరిశోధనా బృందం తెలిపింది.
ఈ కిట్‌ను అత్యవసర వినియోగ అనుమతి కోసం ఐసీఎంఆర్‌కు పంపినట్లు తెలిపిన రంగప్ప.. అనుమతి లభిస్తే తయారీదారులతో చర్చలు జరిపి, దీని ధర రూ.100 కంటే తక్కువకే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
మైసూర్ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎస్ చంద్ర నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీడీ మోహన్, మాలిక్యూలర్ బయాలజీ విద్యార్థులు.. టెస్టింగ్ కిట్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఈ బృందానికి రంగప్ప నేతృత్వం వహించారు.
ఇదీ చూడండి: 56 ఏనుగులకు కరోనా పరీక్షలు