ink for election in india: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సుమారు 5 లక్షల సిరా బాటిళ్ల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన మైలాక్ కంపెనీ పేర్కొంది. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌కు 4 లక్షల సీసాలు, పంజాబ్‌కు 62 వేలు, గోవాకు 5 వేలు, మణిపుర్‌కు 7 వేలు, ఉత్తరాఖండ్‌కు 30 వేల సిరా బాటిళ్ల డిమాండ్ ఉన్నట్లు కంపెనీ అధ్యక్షుడు ఎన్వీ ఫణీశ్ తెలిపారు.
ఇప్పటికే పంజాబ్, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అడిగినంత ఇంక్ బాటిళ్లను సరఫరా చేశామని... యూపీకి మాత్రం 2 లక్షల బాటిళ్లు అందించిట్లు ఫణీశ్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో మిగతావి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా ఎన్నికల సంఘం సిరా బాటిళ్లకు బదులుగా మార్కర్ పెన్నులు వినియోగించాలని వాదన వినిపిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలం పాటు ప్రయోగాలు నిర్వహించి కొత్తగా మార్కర్ పెన్నులను కూడా తయారు చేస్తున్నట్లు ఎన్వీ ఫణీశ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... ఇందుకు అవసరమైన సిరాను ఈ సంస్థ సమకూరుస్తోంది.
![5 lakh ink bottles to poll-bound states](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14163021_764_14163021_1641960048356.png)
ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయకుండా గుర్తించడానికి చేతికి సిరా చుక్కను పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నాటి నుంచి ఈ సంస్థ సిరాను ఉత్పత్తి చేస్తుంది. ఇలా సిరా ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ మన దేశంలో ఇదే. ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటుంది.
మైసూర్ మహారాజు నల్వాడి కృష్ణరాజ వడయార్ 1937లో పెయింట్స్, సంబంధిత ఉత్పత్తుల తయారీ కోసం మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ లిమిటెడ్‌గా ఈ సంస్థను ప్రారంభించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. 1962లో ఎన్నికలకు ఇంక్‌ను తయారు చేయాడానికి అనుమతులు పొందింది. దీనిని మొదటగా మూడోసారి నిర్వహించిన సాధారణ ఎన్నికల సమయంలో తొలిసారి ఇక్కడ ఉత్పత్తి చేసిన సిరాను ఉపయోగించారు.
ఇదీ చూడండి: 'ఇల్లు కట్టుకోవడానికి డబ్బులడిగినా వరకట్నం డిమాండ్ చేయడమే'