ముంబయి మహా నగరంలో గడిచిన రెండు నెలల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో నమోదైన కేసుల్లో 90 శాతం అపార్ట్మెంట్ భవనాల్లోనే వెలుగుచూసినట్లు చెప్పారు. మిగిలిన 10 శాతం మురికివాడల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మురికివాడల్లోనూ క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు.
గడిచిన రెండు నెలల్లో మొత్తం 23,002 కొవిడ్ కేసులు నమోదైనట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తెలిపారు.
మార్చి 1 నాటికి నగరంలో 10 కంటైన్మెంట్ జోన్లు, 137 షీల్డ్ భవనాలు ఉండగా.. ఆ సంఖ్య మార్చి 10 నాటికి 27 కంటైన్మెంట్ జోన్లు, 228 షీల్డ్ భవనాలకు పెరిగాయని బీఎంసీ కొవిడ్-19 డాస్బోర్డ్ తెలిపింది.
పుణెలో ఆందోళనకరంగా కేసులు..
పుణెలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది అక్కడి పాలనాయంత్రాంగం. రాత్రి 10 గంటల వరకే హోటళ్లు, రెస్టారెంట్లు అనుమతించింది. 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని పేర్కొంది. వివాహ, రాజకీయ, సామాజిక కార్యకలాపాలు వంటివి 50 మందితోనే నిర్వహించాలని సూచించింది.
ఇదీ చూడండి: అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం