ముంబయిలోని మహారాష్ట్ర సచివాలయంలో బాంబు ఉన్నట్టు వచ్చిన ఫోన్ కాల్లో నిజం లేదని తేలింది. సచివాలయ భవనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధరించారు. అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు ఆరా తీసి.. అతడ్ని నాగ్‌పుర్‌కు చెందిన రైతుగా గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది...
ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు మంత్రాలయ విపత్తు నిర్వహరణ కేంద్రానికి ఓ ఫోన్ వచ్చింది. భవనంలో బాంబు పెట్టారని ఫోన్లో చెప్పారు. బాంబు స్క్వాడ్(బీడీడీఎస్)తో పాటు పోలీసు సిబ్బంది సచివాలయానికి పరుగులు తీశారు. తనిఖీ నిర్వహించిన అనంతరం బాంబు లేదని నిర్ధరించారు.
ఈలోగా, ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు అధికారులు.
"రైతు పేరు సాంగర్ మాంధ్రే(40). ఫోన్ చేసిన రెండు గంటల్లోనే అతడిని పట్టుకున్నాము. 1997లో రైతు భూమిలోని కొంత భాగాన్ని ఓ సంస్థ కొనుగోలు చేసింది. దానికి రావాల్సిన పరిహారం ఇంకా అతడిని అందలేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదని.. ప్రభుత్వ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఈ విధంగా చేసినట్టు ఆ రైతు వెల్లడించాడు."
-- అధికారులు