Mumbai Police Commissioner: హనుమాన్ చాలీసా పారాయణం వివాదంలో అరెస్టైన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, నవనీత్ రాణా దంపతులకు మరో షాక్ తగిలింది. సోమవారం రోజు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు రాణా. ఎస్సీ అనే కారణంతో అసభ్య పదజాలంతో మాట్లాడారని, బాత్రూం కూడా వినియోగించుకునే అవకాశం ఇవ్వలేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కులం పేరుతో దూషించారని, అసభ్య పదజాలంతో ఘోరంగా అవమానించారని ఆరోపించారు. అయితే.. తాజాగా దీనిపై స్పందించారు ముంబయి పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో సిబ్బంది ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాకు టీ, నీళ్లు ఇచ్చారు. ఇరువురూ వాటిని సేవిస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అయితే.. నవనీత్ కౌర్ ఫిర్యాదు చేసింది ఖార్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించింది కాదని, శాంటా క్రూజ్‌లో అని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ''నా క్లయింట్ నవనీత్ కౌర్ పట్ల కస్టడీలో అసభ్యంగా ప్రవర్తించింది ఆమెను నిర్బంధించిన శాంటా క్రూజ్ పోలీస్ స్టేషన్లో. ఖార్ పోలీస్ స్టేషన్లో కాదు. నవనీత్‌కు టీ ఇచ్చింది ఖార్ పీఎస్‌లో.'' అని న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ అన్నారు.
ఇదీ జరిగింది: ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరతామంటూ నవనీత్, రవి రాణా సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటిముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ రాణా దంపతులపై ముంబయి పోలీసులు ఏప్రిల్ 23న రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను రాణా దంపతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్ 24న రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు రాజద్రోహం అభియోగాలపై గత శనివారం రాణా దంపతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. వీరికి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నవనీత్‌ను బైకుల్లా మహిళా జైలుకు, రవి రాణాను ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు.
ఇవీ చూడండి: నకిలీ వైద్యుల నిర్వాకం- సంతానం కోసం వెళ్తే ప్రాణమే తీసేశారు!
''ఎస్సీ' అంటూ పోలీసులు తిట్టారు.. నీళ్లివ్వలేదు, బాత్రూమ్కు వెళ్లనివ్వలేదు'