కొవిడ్‌తో తన తల్లి మృతి చెందిన బాధను భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని రాయ్సన్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది?
మణిదీప్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ప్రాంతంలోని హిమాన్షు వింగ్స్ హౌసింగ్ కాంప్లెక్స్ నాలుగో అంతస్తు నుంచి ఓ మహిళ(32) కిందకు దూకింది. 50 అడుగుల ఎత్తునుంచి పడగా.. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని అదనపు ఎస్పీ అమ్రిత్ మీనా తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆ మహిళ తల్లి.. కరోనాతో మరణించినట్లు పేర్కొన్నారు.
తల్లి మృతితో సదరు మహిళ కుంగుబాటుకు గురైందని ఆమె తండ్రి చెప్పారు.
"వాళ్ల అమ్మ కరోనాతో చనిపోయినప్పటి నుంచి నా కుమార్తె.. అన్నం తినటం మానేసింది. బుధవారం రాత్రి.. నాలుగో అంతస్తులో ఉన్న మా ఇంటి నుంచి కిందకు దూకింది. తను దూకే ముందు తన చేయిని నేను పట్టుకున్నాను. అపార్ట్మెంట్లోని అలారం మోగించాను. కొందరు బయటకు వచ్చారు. కానీ, ఆమె నా చేతిని వదిలించుకుని కిందకు దూకేసింది."
-మహిళ తండ్రి.
మహిళ భవనంపై నుంచి దూకుతున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు మణిదీప్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: బంగాల్లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు
ఇదీ చూడండి: 'ఆక్సిజన్ లీకేజీ' ఘటనలో వారిపై కేసు