Mother buried her child: అప్పుడే పుట్టిన పసిబిడ్డను భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయింది ఓ తల్లి. ఆస్పత్రి ఆవరణలో మట్టిలో కనిపించిన చిన్నారిని చూసి స్థానికులు చలించిపోయారు. శరీరంలో సగభాగం మట్టిలో.. మిగిలిన భాగం భూమిపైన కనిపించిందని తెలుస్తోంది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది.
అయితే, చిన్నారి ప్రాణాలతోనే బయటపడటం విశేషం. శిశువు ఏడుపు విన్న ఓ మహిళ.. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని పోలీసులకు సమాచారం చేరవేసింది. ఎస్ఐ రిజ్వాన్ అలీ, హెడ్ కానిస్టేబుల్ శేష్‌నాథ్, హోంగార్డు ఇంద్రమణి త్రిపాఠి.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారిని మట్టిలో నుంచి బయటకు తీశారు. అనంతరం, ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు.
జిల్లా ఆస్పత్రి పిల్లల వైద్యురాలు డాక్టర్ సర్ఫరాజ్, ఇతర వైద్య సిబ్బంది అప్రమత్తమై శిశువుకు వైద్యం అందించారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
శిశువు తల్లి ఇదే ఆస్పత్రిలో ప్రసవం కోసం చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం, శిశువును వదిలించుకునేందుకు ఇంతటి దారుణానికి పూనుకుంది. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం