RDX Recovered in Gurdaspur: ఎన్నికల వేళ పంజాబ్‌లో ఆర్డీఎక్స్ కలకలం రేపింది. గురుదాస్‌పుర్ జిల్లాలోని ఖరాల్ గ్రామంలో 2.5 కిలోల ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటితో పాటు డిటోనేటర్, ఏకే-47 రైఫిళ్లు లభ్యమయ్యాయి. ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) ఆధ్వర్యంలో పాకిస్థాన్ నుంచి వీటిని భారత్‌కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఈడీలను తయారుచేసేందుకే ఈ పేలుడు పదార్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు.
పాక్‌లో నివసిస్తున్న ఐఎస్‌వైఎఫ్ చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడే.. ఖరాల్ గ్రామంలోని సుఖ్‌ప్రీత్ సింగ్ అలియాస్ సుఖ్‌కు ఈ పేలుడు పదార్థాలను అందిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల పఠాన్‌కోట్ ఆర్మీ కంటోన్మెంట్ వద్ద జరిగిన గ్రనేడ్ దాడులకు సంబంధించి ఐఎస్‌వైఎఫ్ నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టగా.. ఈ ఆర్డీఎక్స్ వివరాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడైన అమన్‌దీప్ కుమార్ అలియాస్ మంత్రి ఇచ్చిన వివరాలతో తెలిశాయని అధికారులు పేర్కొన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఐఎస్‌వైఎఫ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
గతేడాది నవంబరు 11, 21 తేదీల్లో పఠాన్‌కోట్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ వద్ద ఐఎస్‌వైఎఫ్ గ్రనేడ్ దాడులకు పాల్పడింది.
ఇదీ చూడండి : 'భారత్, చైనా సైన్యాల 14వ విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం'