ఛత్తీస్‌గఢ్‌లో భీకర దాడి నేపథ్యంలో మావోయిస్టులకు హెచ్చరికలు చేశారు సీఎం భూపేశ్ బఘేల్. నక్సల్ ఏరివేత ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. తమ ప్రభావం కోల్పోతున్నామనే నిరాశలో, ఉనికి చాటుకునేందుకే నక్సల్స్ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జవాన్ల మనోస్థైర్యాన్ని కొనియాడారు బఘేల్.
"భద్రతా దళాల మనోధైర్యం పతాకస్థాయిలో ఉంది. నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతాల్లో వారికి గట్టి పోటీ ఇచ్చారు. నాలుగు గంటలపాటు సాహసోపేత పోరాటం చేశారు. ఎన్కౌంటర్లో మావోయిస్టులకు తీవ్రనష్టం జరిగింది. వారికి బలంగా ఉన్న ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసి, ఏరివేత ప్రక్రియను ఉద్ధృతం చేస్తాం. "
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం
బీజాపుర్-సుఖ్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం రాత్రి జరిగిన దాడిలో 22 మంది జవాన్లు అమరులయ్యారు. సైనికుల ప్రాణ త్యాగాలు వృథాకావని అన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
"ప్రాణ బలిదానం చేసిన జవాన్లకు వందనం. ఉగ్రశక్తుల ముందు భారత్ ఎన్నడూ తలవంచదు."
- ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి
పిరికి చర్య..
మావోల దాడిని పిరికి చర్యగా అభివర్ణించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. అమరజవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
యోగి సాయం..
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లు చిరస్మరణీయంగా ఉండిపోతారని అన్నారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. చనిపోయినవారిలో యూపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సాయం, ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని హామీఇచ్చారు. రోడ్లకు వారి పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!