కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ మరింత ఉద్ధృతం చేశారు. 2019 సెప్టెంబర్ నుంచి నవంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో మోదీ.. ప్రజా కార్యక్రమాలు 25శాతం పెరిగాయి. సాంకేతికతను ఉపయోగించి 101 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది ఇదే కాలంలో ప్రధాని 78 కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మోదీ.. సమాజంలోని గ్రామీణ ప్రజలు, పెట్టుబడిదారులు, యువత, పరిశ్రమల సీఈఓలతో సాంకేతికత ద్వారా విస్తృతంగా సమావేశమైనట్లు తెలిపాయి. ఈ కాలంలో ప్రధాని సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించాయి. ఇందులో 26 ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నట్లు వివరించాయి.
సమాజంలో అణగారిన వర్గాలకు సాయం చేయడంపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపిన ప్రభుత్వ వర్గాలు.. ప్రధాని సమావేశాలు పేదల సంక్షేమం ప్రధాన నినాదంగా సాగినట్లు పేర్కొన్నాయి. పేదల సంక్షేమం తర్వాత విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపాయి. విద్యా రంగానికి సంబంధించి 8 కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: డోక్లాం తర్వాతి నుంచే చైనా కుట్రలు!