Modi Varanasi Visit: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం రూ. 2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. వారణాసిలోనే గత 10 రోజుల్లోనే మోదీకి.. ఇది రెండో పర్యటన కావడం విశేషం.
Modi Development Projects: గురువారం ఉదయం వారణాసి చేరుకున్న మోదీ.. తొలుత బనాస్ డెయిరీ సంకుల్‌కు (బనాస్ పాల ఉత్పత్తి కేంద్రం) శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల మేర విస్తీర్ణంలో ఉండే ఈ డెయిరీ నిర్మాణం కోసం రూ. 475 కోట్లు వెచ్చించనున్నారు. రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బనాస్ డైరీకి చెందిన 1.7 లక్షల మంది పాల విక్రయదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 35 కోట్ల బోనస్‌ను జమ చేశారు మోదీ.
పాడిపరిశ్రమను బలోపేతం చేయడం కూడా తమ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలలో ఒకటి అని, అందుకే బనాస్ డెయిరీ సంకుల్ శంకుస్థాపన చేసినట్లు మోదీ పేర్కొన్నారు.
''భారత్‌లో పాల ఉత్పత్తి గత 6-7 సంవత్సరాలతో పోలిస్తే దాదాపు 45 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క భారత దేశమే 22 శాతం పాలను ఉత్పత్తి చేస్తోంది. పాల ఉత్పత్తిలోనే కాకుండా.. డెయిరీ రంగాన్ని విస్తరించడంలోనూ యూపీనే ముందున్నందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాని
PM Modi on cow
ఇక్కడ ఆవు, ఆవు పేడ గురించి మాట్లాడితే ఏదో నేరం చేసినట్లు భావించే వాతావరణాన్ని సృష్టించారని విపక్షాలను ఉద్దేశించి విమర్శించారు ప్రధాని. కానీ ఆవు తమకు తల్లి లాంటిదని, పవిత్రంగా భావిస్తామని చెప్పారు.
''ఆవులు, గేదెలపై జోక్స్ వేసేవారు.. కోట్లాది ప్రజలు జీవనోపాధి దీనిపైనే ఆధారపడి ఉందని మర్చిపోతున్నారు.''
- నరేంద్ర మోదీ, ప్రధాని
సమాజ్‌వాదీ పార్టీని విమర్శిస్తూ.. వాళ్ల డిక్షనరీలో మాఫియావాద్(మాఫియావాదం), పరివార్వాద్(కుటుంబవాదం), అనే పదాలు ఉంటే.. తమకు 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ఉన్నాయని, అవే ముఖ్యమని అన్నారు ప్రధాని.
వారణాసిలోనే రాంనగర్లో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
Modi Kashi Vishwanath Dham: ఈ డిసెంబర్ 13న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం మోదీ వారణాసిలో పర్యటించారు. అప్పుడు గంగా నదిలో పుణ్యస్నానం కూడా చేశారు. అంతకుముందు కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు.
మరుసటి రోజు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు ప్రధాని. డిసెంబర్ 17న వారణాసిలో జరిగిన అఖిల భారత మేయర్ల సదస్సుకు వర్చువల్‌గా హాజరయ్యారు.
ఇవీ చూడండి: ఆర్టీఐ కార్యకర్తపై దుండగుల దాడి.. పాదాల్లో మేకులు దింపి...