PM Modi Defence Expo: దేశ ఆయుధ సంపత్తి, సైనిక శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎక్స్‌పో-2022ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. దీసా ఎయిర్‌బేస్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
"భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయి. దేశం చాలా ముందడగు వేసింది. ఒకప్పుడు గాల్లోకి పావురాలను వదిలేవారు. ఇప్పుడు చీతాలను విడిచిపెడుతున్నాం. కేవలం భారతీయ కంపెనీలు మాత్రం పాల్గొనే తొలి డిఫెన్స్ ఎక్స్‌పో ఇది. ఉత్తర గుజరాత్‌లో నిర్మించే దీసా వద్ద కొత్త ఎయిర్‌బేస్.. దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. త్వరలోనే 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం విధిస్తాం. వీటిని భారత్‌లోనే తయారుచేసి వినియోగించుకోవాలి. అంతర్జాతీయ భద్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యం కోసం మొత్తం ప్రపంచానికి సముద్ర భద్రత ప్రాధాన్యంగా మారింది."
-ప్రధాని మోదీ
భారతదేశాన్ని బలమైన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచానికి రక్షణ తయారీ కేంద్రంగా భారత్ మారాలనే మా దృఢ సంకల్పాన్ని ఈ ఎక్స్‌పో ప్రతిబింబిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
'పాత్ టు ప్రైడ్' కాన్సెప్ట్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో స్టాల్స్ కొలువుదీరబోతున్నాయి. ఈ ఎక్స్‌పోలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన ఆయుధ వ్యవస్థ, అంతర్గత భద్రతావ్యవస్థలు, సాంకేతికతను ప్రదర్శించనున్నారు. డీఆర్డీఓ నేతృత్వంలో అనేక భారతీయ పరిశ్రమలు ఈ ఎక్సోపోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ ఎక్స్‌పో చివరి రెండు రోజుల్లో (అక్టోబర్ 21- 22) ప్రజల కోసం తెరవనన్నారు.
ఇవీ చదవండి: భారీ వర్షాలు.. కుప్పకూలిన మైసూర్ ప్యాలెస్ గోడ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే!