దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి.. తాజాగా జరిగిన ఘటన, దాని తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఓ యాప్ ద్వారా ప్రజలను మోసం చేసి సంపాదించిన రూ. 360కోట్లు అక్రమ మార్గంలో చైనాకు వెళ్లిపోయాయి.
భారత్ టు చైనా...
హాంగ్‌కాంగ్, చైనా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కొందరు సైబర్ నేరగాళ్లు.. భారతీయులను సులభంగా బుట్టలో వేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ రూపొందించి.. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. అలా.. ఒక్క రోజులో కోట్ల రూపాయలు వారి ఖాతాలో వచ్చిచేరాయి. ఆ తర్వాత దాదాపు రూ. 360కోట్ల అక్రమ సొమ్ము దేశంలోని వివిధ ఆన్లైన్ మార్గాల ద్వారా చైనాకు వెళ్లింది. అక్కడి నుంచి 'పవర్ బ్యాంక్ యాప్' ద్వారా అవి క్రిప్టోకరెన్సీలో చేరాయి.
ఈ వ్యవహారం అంతా ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) దర్యాప్తులో బయటపడింది. చైనాకు ఈ అక్రమార్జన ఏ విధంగా వెళ్లిందనే విషయాన్ని దెహ్రాదూన్ సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్‌లను గుర్తించారు.
హాంగ్‌కాంగ్ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఈ-వాలెట్ పేటీఎమ్, రేజర్ పే ప్రతినిధులకు ఎస్టీఎప్ సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించి.. ఉత్తరాఖండ్‌లోని ఇద్దరు కీలక నిందితులు, బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది.
అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. విదేశీయుల హస్తం ఉన్నందున సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి నేరాలను నిలువరించేందుకు జాతీయ స్థాయిలో సంస్కరణలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇదీ చూడండి:- పంథా మార్చిన సైబర్ క్రైమ్స్- ఇలా జాగ్రత్తపడండి..