MLC Kavitha Fell Sick in Election Campaign in Jagtial : ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ఇటిక్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార రథంలో నిలబడి ప్రసంగిస్తుండగా.. ఎండ వేడిమికి కళ్లు తిరిగి ప్రచార రథంలోనే పడిపోయారు. దీంతో కార్యకర్తలు కొద్దిసేపు ఆందోళనకు గురి కాగా.. కాసేపటికి తేరుకున్న కవిత తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ నుంచి చాలా మంది నక్సలైట్లలో కలిశారని.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాన ఎన్నో కార్యక్రమాలు చేయటంతో నక్సలైట్లలో కలవకుండా చేశామన్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాకపోతే మళ్లీ నక్సలైట్లలో కలుస్తారని వాళ్లు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్, ఇటిక్యాల, భూపతిపూర్, వస్తాపూర్, కట్కాపూర్, బీర్‌పూర్ గ్రామాల్లో రోడ్ షోలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాల్లో పాల్గొన్నారు.
గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఎన్నికల పోటీలో ఇదే చివరిసారి అంటూ మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే వృథా అవుతుందని.. ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత ఉన్నారు.