కొవిడ్ నుంచి కోలుకున్న వారిని కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ (మ్యుకర్‌మైకోసిస్) వ్యాధికి స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే ప్రధాన కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ శిలీంధ్ర వ్యాధి కట్టడికి ఆస్పత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు.
"కొవిడ్ కేసులు పెరుగుతున్నందున బ్లాక్ ఫంగస్ వ్యాప్తి నియంత్రించేందుకు అన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించటం అత్యవసరం. ఈ వ్యాధి కారణంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. మ్యుకర్‌మైకోసిస్ అనే ఈ శిలీంధ్రం.. భూమిలో, మట్టిలో, మనం తినే ఆహారంలో కూడా ఉంటుంది. కానీ, అది ఇన్ఫెక్షన్ను కలిగించదు. కొవిడ్‌కు ముందు ఈ ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వారి సంఖ్య చాలా అరుదుగా ఉండేవి. కానీ, ప్రస్తుతం కొవిడ్ వల్ల ఈ శిలీంధ్ర వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.''
-రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
"ముఖం, ముక్కు, కంటి వలయం, మెదడును బ్లాక్ ఫంగస్ దెబ్బ తీస్తుంది. దీని వల్ల కంటిచూపు కూడా కోల్పోతారు. ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం.. స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే. డయాబెటిక్ రోగులు ఈ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ స్టిరాయిడ్లను అతిగా వినియోగించటం మానేయాలి" అని గులేరియా పేర్కొన్నారు.
ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి 23 మంది చికిత్స పొందుతున్నారని గులేరియా తెలిపారు. వారిలో 20 మందికి ఇంకా కొవిడ్ పాజిటివ్‌గా ఉండగా.. మిగతా వారికి నెగెటివ్‌గా తేలినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో 500 చొప్పున ఈ తరహా కేసులు వెలుగుచూశాయని చెప్పారు.
అంతకుముందు ఈ బ్లాక్‌ఫంగస్‌ను 'నోటిఫైడ్ డిసీస్'గా హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఈ వ్యాధిని పర్యవేక్షించేందుకుగానూ ఏడుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో 12 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా.. వారిలో ఇద్దరు చనిపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్‌పై హర్షవర్ధన్ కీలక సూచనలు