బంగాల్లో భాజపా ఎంపీ ఇంటి బయట బాంబు దాడి (West Bengal MP bomb) జరిగింది. బరాక్పుర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను తృటిలో గాయాల నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఈ సమయంలో ఇంట్లో అర్జున్ సింగ్ లేరు. ఆయన ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు.
తెల్లవారుజామున మూడు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. వరుసగా మూడు బాంబులు (bombs hurled at MP) విసిరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది.
గవర్నర్ ఆందోళన
ఈ ఘటనపై బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ (Bengal governor) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్జున్ సింగ్ భద్రత అంశాన్ని తాను ఇదివరకే లేవెనత్తినట్లు ధన్కడ్ తెలిపారు. సమస్య గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించినట్లు చెప్పారు.