మధ్యప్రదేశ్ ఇందోర్‌లో దారుణం జరిగింది. 16 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు గుర్తు తెలియని దుండగుడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరింది. నిందితుడిపై విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇందోర్‌లోని అనుభవి విజన్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థలో బాధితురాలు గత నాలుగేళ్లుగా ఉంటోంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు గుర్తు తెలియని దుండగుడు. దీంతో ఆరు నెలల క్రితం బాధితురాలు గర్భం దాల్చింది. తాజాగా ఈ విషయం బాధితురాలి తల్లికి తెలియడం వల్ల వెలుగులోకి వచ్చింది. దీంతో తన కుమార్తెకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై నిందితుడి కోసం గాలిస్తున్నారు. అనుభవి విజన్ సేవా సంస్థాన్‌పై దర్యాప్తు చేపట్టారు.
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం దేశంలో రోజుకు 130 మంది చిన్నారులు లైంగిక వేధింపులు గురవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే చిన్నారుల లైంగిక వేధింపుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
భవనం పైనుంచి దూకిన బాలిక
రాజస్థాన్ కోటాలో ఘోరం జరిగింది. నీట్‌కు ప్రిపేర్ అవుతున్న 17 ఏళ్ల బాలిక భవనం పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో 17 ఏళ్ల యువకుడు, అతడి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతురాలి తండ్రి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలు ల్యాండ్‌మార్క్ సిటీ ప్రాంతంలో తన ఇద్దరు సోదరులు, సోదరితో కలిసి ఉంటోంది. నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటోంది. నీట్‌కు సిద్ధమవుతున్న నిందితుడు ఆమె తల్లితో కలిసి బాధితురాలు నివసిస్తున్న భవనంలోనే.. నాలుగో అంతస్తులో ఉంటున్నాడు. ఓ రోజు నిందితుడు, బాధితురాలు సన్నిహితంగా ఉండడాన్ని అతడి తల్లి చూసింది. అప్పటి నుంచి బాధితురాల్ని అసభ్యకర భాషతో దూషించేది. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఓ లెటర్ రాసి భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
"బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 17 ఏళ్ల యువకుడు, అతడి తల్లిపై కేసు నమోదు చేశాం. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాం. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధారించేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించాం. "
--పోలీసులు