Ministry of Civil Aviation Latest rules: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది పౌర విమానయాన శాఖ. దీనికోసం పలు నిబంధనలను విధించింది. అవి ఏంటంటే..
- 'ప్రమాదకర దేశాల' నుంచి వస్తున్నవారు, గడచిన 14 రోజుల్లో ఆ దేశాలను సందర్శించినవారు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. దీనికోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి.
- సంబంధిత విమానాశ్రయ వెబ్‌సైట్ లింక్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను నింపేటప్పుడు ఇది కనిపిస్తుంది. అందుకనుగుణంగా 'ఎయిర్ సువిధ పోర్టల్'ను సవరిస్తారు.
- ప్రధానంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది.
- ప్రయాణికుల సౌకర్యార్థం డిసెంబర్ 20 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.
ఒమిక్రాన్‌తో మారిన పరిస్థితులు..
Jyotiraditya Scindia Latest News: 'అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ అనేది ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది' అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. రాబోయే రెండు వారాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం' తెలిపారు. ప్రస్తుతం రోజుకు 3.9 లక్షల మంది ప్రయాణికులు వస్తున్నారు. కొవిడ్‌కు ముందు గరిష్ఠంగా 4.2 లక్షల మంది ప్రయాణించేవారు. అయితే ఒమిక్రాన్ వల్ల పరిస్థితులు మారాయని వివరించారు.
ప్రమాద బాధితులకు ఊరట కలిగేలా..
Jyotiraditya Scindia at CII: రహదారి ప్రమాదాల్లోని బాధితులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రధాన రహదారుల వెంబడి హెలీప్యాడ్‌లను అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సింధియా తెలిపారు. ఇందులో భాగంగా హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను (హెచ్‌ఈఎంఎస్) సత్వరమే ప్రారభిస్తామన్నారు.
"ముంబయి, దిల్లీ వంటి చోట్ల ప్రధాన రహదారుల వెంబడి హెలిప్యాడ్‌ల అభివృద్ధి ఆవశ్యకతను తెలుసుకునేందుకు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తున్నాం."
--జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ మంత్రి
దేశంలో.. దాదాపు 250 హెలికాప్టర్లు ఉన్నాయని.. అయితే హెలిప్యాడ్లు జిల్లాకు ఒకటి కూడా సరిగా లేదని సింధియా తెలిపారు.
"ఇటీవల ప్రవేశపెట్టిన నూతన హెలికాప్టర్ విధానంతో అనుమతుల ప్రక్రియ సులభతరమైంది. మూడు హెలికాప్టర్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. అవి ముంబయి-పుణె, బేగంపేట-శంషాబాద్, అహ్మదాబాద్-గాంధీనగర్."
--జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ మంత్రి
విమానాలు బంద్..
International Flights to India: ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసులను 2022 జనవరి 31 వరకు నిలిపివేయనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అంతకుముందు నవంబర్ 26న చేపట్టిన సమీక్షలో డిసెంబర్ 15నుంచి అంతర్జాతీయ విమానాలను అనుమతించాలని నిర్ణయించింది.
Flights Ban DGCA: కరోనా విజృంభణ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను భారత్ నిలిపేసింది. అయితే.. 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద, 2020 జులై నుంచి ఎంపిక చేసిన దేశాల నుంచి ద్వైపాక్షిక అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తోంది.
ఇవీ చదవండి: