జాతీయ స్థాయిలో వైద్యవిద్యా కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలు వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అఖిల భారత కోటా పథకం కింద యూజీ, పీజీ దంత వైద్యవిద్య కోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా.. ఇదో చారిత్రక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
2021-22 విద్యా సంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనివల్ల ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో కలిపి దాదాపు 4 వేల మంది ఓబీసీ విద్యార్థులకు, 15 వందల మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ది చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది.
చారిత్రక నిర్ణయం
ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు." ఇది ఏటా వేలాది మంది యువతకు మంచి అవకాశాలు పొందడానికి, మన దేశంలో సామాజిక న్యాయం కొత్తరూప దాల్చడానికి ఎంతో సహాయపడుతుంది" మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రిజర్వేషన్ల అంశంపై దృష్టి సారించాలని మంత్రిత్వ శాఖలకు సూచించారు మోదీ.
ఇదీ చూడండి: మరాఠాలకు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపు