Minister toilet cleaning: మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఇంధన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి.. పాఠశాలలో శౌచాలయాలను శుభ్రం చేశారు. టాయిలెట్లు సరిగా లేకపోవడం వల్ల బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించి.. స్వయంగా శౌచాలయాలను కడిగారు.

Pradhuman Singh Tomar news
స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ముప్పై రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని సంకల్పించుకున్నారు మధ్యప్రదేశ్ ఇంధన మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్. ఈ నేపథ్యంలో గ్వాలియర్, హజిరాలోని ఓ పాఠశాలను సందర్శించిన ప్రద్యుమన్.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై అక్కడి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.


ఈ క్రమంలో ఓ విద్యార్థిని స్కూల్లో అపరిశుభ్రత గురించి మంత్రికి ఫిర్యాదు చేసింది. టాయిలెట్లు ఉపయోగించుకోలేని రీతిలో ఉన్నాయని, దుర్గంధంతో అటువైపునకు వెళ్లలేకపోతున్నామని వాపోయింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగి శౌచాలయాలను శుభ్రం చేశారు మంత్రి ప్రద్యుమన్.

అందుకే స్వయంగా..
పనులు చేయించే అధికారంతో పాటు వాటిని స్వయంగా చేయొచ్చన్న బాధ్యత కూడా తమపై ఉంటుందని ప్రజా ప్రతినిధులకు సందేశం అందించేందుకే ఇలా చేశానని చెప్పారు ప్రద్యుమన్. ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రేరణ కల్పించేందుకు స్వయంగా టాయిలెట్ క్లీన్ చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: అమ్మాయిల వివాహ వయసు మార్పు వెనుక ఆ ఇద్దరు!