దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. కొత్త వేరియంట్ల కలకలంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యాక్టివ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను ఆంక్షలను సడలిస్తున్నాయని.. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా పేర్కొన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించాలని సూచించారు. అనుసంధానంగా ఉన్న జిల్లాల్లో కఠిన పర్యవేక్షణ అవసరమన్నారు.
"ఆంక్షలను సడలించే ప్రక్రియను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. రాష్ట్రాలు.. రోజూ పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య నిశితంగా పరిశీలించాలి. పాజిటివిటీ రేటు, రోగుల సంఖ్య పెరుగుతున్నట్లయితే.. ఆంక్షలు విధించాలి. అలాగే వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి."
- అజయ్ భల్లా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి
కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టిసారించాలని సూచించారు. కరోనా కట్టిడికి పరీక్షల నిర్వహణ, ట్రేసింగ్, చికిత్స, కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఐదంచెల వ్యూహాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్ వివరణ ఇవ్వాలి'