Mentally Ill Person Missing : సినిమాల్లోని హీరోల్లా ప్రవర్తిస్తూ అందరిపై దాడి చేసే ఓ మానసిక రోగి.. మూడు నెలల క్రితం తప్పిపోయి తాజాగా కర్ణాటకలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను హీరోగా భావిస్తూ యాక్షన్ సీన్ల పేరుతో దాడి చేసి అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. చికిత్స కోసం భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు మూడు నెలల తర్వాత అతడి ఆచూకీ లభ్యమైంది.
అసలేమైందంటే?
మహారాష్ట్ర.. బీడ్ జిల్లాలోని దస్కాడేకు చెందిన ముసలే భగవాన్ కుమారుడు తుకారామ్కు సినిమాలంటే చాలా ఇష్టం. అతడు చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. సినిమాలు చూసిన ప్రతీసారి అతడి వ్యాధి తీవ్రత మరింత ఎక్కువయ్యేది. అంతే కాకుండా మూవీలు చూశాక అందులోని హీరోలాగే ప్రవర్తించాలనుకుని అనేక మందిని ఇబ్బందిపెట్టేవాడు.
అయితే తుకారాం మానసిక వ్యాధి నయం చేయించాలన్న ఉద్దేశంతో అతడి కుటుంబసభ్యులు.. మూడునెలల క్రితం భూతవైద్యుడిని సంప్రదించారు. ఆ సమయంలో భూతవైద్యుడు.. తుకారాంను తన వద్ద 15రోజులు ఉంచాలని కోరాడు. అప్పుడే వైద్యం చేస్తానని తెలిపాడు. అందుకు తుకారం కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే భూతవైద్యుడు చికిత్స ప్రారంభించిన ఒక్కరోజుకే తుకారాం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక వెళ్లిపోయిన తుకారాం.. మంగళూరు రోడ్లపై తిరిగాడు. ఆ సమయంలో వైట్ డోవ్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రస్కిన్.. అతడిని రక్షించారు. తమ సంస్థకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. చికిత్స అనంతరం తన ఊరి పేరు చెప్పాడు తుకారాం. దాని ప్రకారం అతడి కుటుంబసభ్యులను సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అనంతరం తుకారం సోదరుడు సాకారాం వచ్చి అతడిని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు.
"తుకారాం మానసిక వ్యాధితో బాధపడుతూ గతంలో నాలుగు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చాం. చివరకు భూతవైద్యుడి వద్ద వైద్యం చేయించేందుకు తీసుకెళ్లాం. అక్కడి నుంచి పరారయ్యాడు. సినిమాలు చూడడం అంటే అతడికి పిచ్చి. ఆయా సినిమాల హీరోల మాదిరిగానే ప్రవర్తించేవాడు" అని సాకారాం తెలిపాడు.
"ఆగస్టు 7వ తేదీన రోడ్డుపై తుకారాంను గుర్తించాను. వెంటనే మా సంస్థకు తీసుకెళ్లాను. మొదట్లో సినిమాల యాక్షన్ సీన్ల పేరుతో ఇతర రోగులపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి మానసిక స్థితి ఫర్వాలేదు. ఇంకా అతడికి మెరుగైన చికిత్స చేయించాల్సి ఉంది" వైట్ డోవ్స్‌కు చెందిన కోరినా రస్కిన్ తెలిపారు.