ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్ అధినేత, పద్మభూషణ్ గ్రహీత మహాశయ్ ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో దిల్లీలోని ఆసుపత్రిలో చేరిన ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.
అంచెలంచెలుగా వ్యాపార సామ్రాజ్యం..
1923లో పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన గులాటీ నాలుగో తరగతితోనే చదువు మానేశారు. ఉపాధి కోసం ఒకప్పుడు దిల్లీ రోడ్లపై గుర్రపు బండి నడిపిన ఆయన.. మసాలా సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత చిన్న బడ్డీకొట్టుతో మొదలైన ఆయన వ్యాపారం అనతి కాలంలోనే దిగ్గజ పరిశ్రమ స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఏడాదికి రూ.900 కోట్ల టర్నోవర్‌తో విదేశాల్లోనూ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరింది. అమెరికా, కెనడా, ఇంగ్లడ్, జపాన్, యూఏఈ, సౌదీఅరేబియా లాంటి ఎన్నో దేశాలకు ఎండీహెచ్ మసాలా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఎండీహెచ్ 62 రకాల మసాలాలను ఉత్పత్తి చేస్తోంది.
జీతంలో 90 శాతం సామాజిక సేవలకే..
వ్యాపార రంగంలోనే కాదు.. దానధర్మాల్లోనే గులాటీ ఎప్పుడూ ముందుంటారు. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఆలోచనతో మహాశయ్ చున్నీలాల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తన జీతంలో 90 శాతానికి పైగా ఈ సంస్థ నిర్వహంచే సామాజిక సేవా కార్యక్రమాలకే వెళ్తోందంటే ఆయన ఉదారత అర్థం చేసుకోవచ్చు. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ‘పద్మభూషణ్’ అందుకున్న ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని గులాటీ అంటుండేవారు.
ప్రముఖుల సంతాపం..
గులాటీ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘భారత అత్యుత్తమ వ్యాపారవేత్తలో ఒకరైన మహాశయ్ ధర్మపాల్ గులాటీ మరణం బాధాకరం. చిన్న వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరిక్షణం వరకు సేవ చేస్తూనే గడిపారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తదితరులు కూడా సంతాపం తెలిపారు.