ఒడిశా పూరీలోని బాలంగ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. భవనం పెద్ద ఎత్తున దెబ్బతింది. స్టేషన్లోని సామగ్రి, దస్త్రాలు అన్నీ కాలిపోయాయి. కొంతమేర పైకప్పు సహా గోడలు కూలిపోయాయి. ఇది పిపిలీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సెప్టెంబర్ 30న ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది.


ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన పేలుడు పదార్థాలు, బ్యాటరీలను స్టేషన్లో ఉంచగా.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పూరీ ఎస్పీ.. దర్యాప్తు చేపట్టారు.

ఎన్నికల విధుల్లో ఉన్నందున.. పేలుడు జరిగిన సమయంలో స్టేషన్లో ఎవరూ లేరు. ఒక్క సెంట్రీ మాత్రమే ఉండగా.. అతడు పేలుడు శబ్దం విన్నవెంటనే బయటకు పరుగులు తీశాడు.


ఈ పేలుడు ఘటనతో.. చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు.. పోలీస్ స్టేషన్లో ఎందుకు నిల్వ ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: Zojila Tunnel: కశ్మీర్-లద్దాఖ్ పర్యటకానికి కొత్త వన్నెలు