Margadarsi Case Updates: ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఈ ఏడాది జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు.. దాని ఆధారంగా చిట్‌గ్రూపుల నిలిపివేతను సవాలు చేస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పి.రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల చిట్‌గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాలు చేస్తూ మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని.. సింఘ్వీ వాదించారు. చిట్ గ్రూపుల నిలిపివేసే పరిస్థితే ఉత్పన్నం కానప్పుడు చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 48(హెచ్) ప్రకారం నోటీసిచ్చే అధికారం చిట్స్ రిజిస్ట్రార్‌కు లేదన్నారు. 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదూ లేదని.. సొమ్ము చెల్లించలేదనే ఆరోపణే రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై దాడి చేయడం ప్రారంభించిందని.. ఆ దాడులను వివిధ సందర్భాల్లో తెలంగాణ, ఏపీ హైకోర్టులు తిప్పికొట్టి.. ఎప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులిచ్చాయని చెప్పారు.
మార్గదర్శిలో సోదాలు చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నితే.. హైకోర్టు విచారణ జరిపి సోదాల ప్రక్రియను నిలువరించిందన్నారు. చిట్స్ ప్రారంభించకుండా అడ్డుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులనూ కోర్టు తప్పుపట్టిందని.. చిట్స్ నిర్వహణకు ఆటంకం కలిగించొద్దని తేల్చిచెప్పిందని వివరించారు. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్‌మెన్‌లపై ఏడు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని.. అరెస్టులు చేయడానికి కుట్ర పన్నారని వాదించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు.
ఆడిట్ నిర్వహణ కోసం ప్రభుత్వం మరొక ఎత్తుగడ వేసిందని.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆడిట్ చేయడానికి తగిన ఆధారాల్లేవంటూ ఆ ప్రక్రియనూ నిలువరించిందని తెలిపారు. మరొక ప్రయత్నంగా చిట్ గ్రూపుల నిలిపివేతకు డిప్యూటీ చిట్ రిజిస్ట్రార్లు ఉత్తర్వులిచ్చారన్న సింఘ్వీ.. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపి ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేసిందన్నారు.
మార్గదర్శిని వేధింపులకు గురిచేయాలన్న దురుద్దేశంతో వివిధ దశల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టులు 5 సందర్భాల్లో స్టే ఉత్తర్వులిచ్చాయని.. మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదూ లేదని, సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారనే ఆరోపణే లేదనే విషయాన్ని న్యాయస్థానాలు ఉత్తర్వుల్లో రికార్డు చేశాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త కారణాలను తెరపైకి తెస్తూ చట్టనిబంధనల ముసుగులో మార్గదర్శిపై కక్షపూరిత చర్యలు కొనసాగిస్తూనే ఉందని కోర్టుకు వివరించారు. అందులో భాగంగానే తాజాగా బహిరంగ నోటీసిచ్చారని.. చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలను బహిరంగ నోటీసులో ప్రస్తావించారని వాదించారు.
చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చాక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనప్పుడు.. బహిరంగ నోటీసివ్వాల్సిన అవసరమే లేదన్నారు. చిట్ గ్రూపులను నిలిపేయలని ప్రభుత్వం ముందుగా నిర్ధారణకు వచ్చాకే బహిరంగ నోటీసు ఇచ్చినట్లు స్పష్టమవుతోందని సింఘ్వీ కోర్టుకు నివేదించారు. సంజాయిషీ నోటీసు జారీ వెనుక దురుద్దేశం కనబడుతోందన్నారు. క్రమపద్ధతిలో సాగిపోతున్న చిట్‌గ్రూపులకు ఆటంకం కల్పించి వాటిని నిలిపివేయాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ నేపథ్యంలో నేరుగా హైకోర్టును ఆశ్రయించే అధికారం పిటిషనర్ సంస్థకు ఉందని చెప్పారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే అధికార పరిధి హైకోర్టుకు ఉందని.. చిట్ గ్రూపుల నిలిపివేత నిర్ణయం చాలా తీవ్రమైన వ్యవహారమని ధర్మసనానికి సింఘ్వీ వివరించారు.
మార్గదర్శికి చెందిన 1035 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మార్గదర్శికి 1500 కోట్ల రిజర్వుఫండ్ ఉందని.. చందాదారులు ఎవరికైనా నష్టం జరిగితే చిట్ విలువలో 10 శాతం సొమ్మును ఫోర్‌మెన్ ఖాతాలో రిజర్వుగా ఉంచారని వివరించారు. ఈ నేపథ్యంలో చందాదారులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన పత్రిక అక్రమంగా సర్క్యులేషన్ పెంచుకోవడంపై రెండు పత్రికల మధ్య వైరం మొదలైందని.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిందని.. వృత్తిపరమైన ధ్వంసం చేసి తద్వారా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని వాదించారు.
చందాదారులకు నోటీసులిచ్చి సీఐడీ బెదిరింపులకు పాల్పడుతుందని.. పాన్, ఆధార్ కార్డులు, ఐటీ రిటర్న్‌లు సమర్పించాలని వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. మార్గదర్శిపై తప్పుడు ఫిర్యాదులు చేయించేందుకు యత్నిస్తోందని.. అందులో భాగంగా ఇటీవల ఓ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని చెప్పారు. చిట్ నిర్వహణకు ముందుగా అన్ని అంశాల్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం - చిట్ రిజిస్ట్రార్లు అనుమతి ఇస్తారన్న సింఘ్పీ... ఈ నేపథ్యంలో ఉల్లంఘనలకు తావే ఉండదని స్పష్టం చేశారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బహిరంగ నోటీసు ఆధారంగా తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. చిట్ గ్రూపుల నిర్వహణ సాఫీగా కొనసాగేలా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థకు రక్షణ కల్పించాలన్నారు.
గురువారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు ముగియడంతో మరొక వ్యాజ్యంలో సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనల కోసం విచారణ.. సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జయసూర్య గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.