Manipur Violence Supreme Court Hearing : మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన భయంకరమైందని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఘటనపై నమోదు చేసిన FIR, అరెస్టులు సహా ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి ఆరా తీసింది. ఆ మహిళలను అల్లరిమూకలకు అప్పగించిన మణిపుర్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేయడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం, మణిపుర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ అధికారుల వాదనలు విన్న తర్వాత మణిపుర్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి సిట్ లేదా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
Manipur Women Parade : మణిపుర్‌లో మహిళలను వివస్త్రలు చేసి ఊరేగించిన ఘటన మే 4వ తేదీనే వెలుగులోకి రాగా.. మే 18వ తేదీ వరకు FIR ఎందుకు దాఖలు చేయలేదని సుప్రీంకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 14 రోజులు ఏం చేస్తున్నారని పోలీసులను నిలదీసింది. ఈ అమానవీయ ఘటనకు ముందు పోలీసులు అల్లరి మూకలను అదుపు చేయలేక మహిళలను వారికి అప్పగించారని మీడియాలో వార్తలొచ్చాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే ఈ కేసును మణిపుర్ పోలీసులు విచారణ చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. జాతుల మధ్య హింసతో రగిలిపోతున్న మణిపుర్‌లో నమోదైన జీరో FIRల సంఖ్యతో పాటు.. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారన్న వివరాలు తెలియజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితులకు పునరావాసం, పరిహారం చెల్లింపునకు సంబంధించిన వివరాలు కూడా అందించాలని స్పష్టం చేసింది. బాధిత మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇద్దరి మహిళలకు సంబంధించిన కేసును జులై 27న సీబీఐకి బదిలీ చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. మహిళలపై నేరాలను ఉపేక్షించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది.
'సివిల్ సొసైటీ మహిళలతో కమిటీ ఏర్పాటు చేయాలి'
అత్యాచార బాధితులు.. తమకు జరిగిన విషయాన్ని అంత వేగంగా బయటపెట్టలేరని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు వివరించారు. "సీబీఐ విచారణ మొదలుపెడితే ఆడవాళ్లు బయటకు విషయాలన్నీ చెప్తారన్న నమ్మకం లేదు. ఈ ఘటన గురించి పోలీసులు కాకుండా బాధితురాళ్లతో మహిళలు మాట్లాడితే సౌకర్యంగా ఉంటుంది. అనుభవం ఉన్న పౌర సమాజంలోని మహిళలతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి" అని కోరారు.
పిల్‌ను స్వీకరించేందుకు నిరాకరణ
మరోవైపు.. మణిపుర్‌లో గసగసాల సాగు, సీమాంతర ఉగ్రవాదం, అల్లర్లపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను స్వీకరించడం చాలా కష్టమని.. ఎందుకంటే ఇది ఒక సమాజంపై నిందలు వేస్తుందని అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సీమాంతర ఉగ్రవాదం, గసగసాల సాగు ఇటీవలే హింసకు కారణమని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్.. ధర్మాసనానికి తెలిపారు.
సుమోటోగా స్వీకరించిన సుప్రీం
జూన్ 20వ తేదీన.. నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు ఘటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేశాయని, ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందన్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమైన ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది.
అయితే మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసినట్లు జులై 27న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మహిళలపై ఎలాంటి నేరాలు జరిగినా ప్రభుత్వం సహించేది లేదని పేర్కొంది. ఈ కేసులో విచారణను సమయానుకూలంగా ముగించడానికి మణిపుర్ వెలుపల విచారణను బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
ఆ రోజు ఏం జరిగింది?
Manipur Woman Paraded Video : ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మైతేయ్ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో తమ ఊరి మీదికి కూడా మైతేయ్‌ల గుంపు దాడి చేయనుందనే సమాచారంతో.. మే 4వ తేదీన బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన కుకీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) ఒకే కుటుంబం కాగా.. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అదే సమయంలో వారికి నాంగ్‌పోక్ సెక్మై వద్ద పోలీసులు కనిపించడం వల్ల వారి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి చదివేయండి.