మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. గత నెల భగ్గుమన్న ఆ రాష్ట్రం.. భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ వంటి చర్యలతో ఇన్నిరోజులు నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా స్థలం విషయంలో మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఇద్దరు దుండగులు సోమవారం మధ్యాహ్నం తమ దుకాణాలను మూసివేయాలని ప్రజలను బలవంతం చేయడం వల్ల ఒక గుంపు రెండు ఇళ్లను తగులబెట్టిందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు.
తాజా ఘటనతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించింది ఆర్మీ సిబ్బంది. దీంతో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించింది. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఇంఫాల్ తూర్పు జిల్లాలో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మణిపుర్‌లో మెజారిటీలుగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. ఈ నెల 3వ తేదీ అవి నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రం మండిపోయింది. ఆ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. కానీ మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది. ఇంతకుముందు మణిపుర్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పాల్గొనాల్సిన సభావేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేశారు.
కళ్లముందు విధ్వంసకాండ!
గతనెల రాజుకున్న ఈ అల్లర్ల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మణిపుర్ ప్రజలు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటనతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చెలరేగిన హింసాకాండలో ప్రాణ నష్టంతో పాటు కోట్లల్లో ఆస్తి నష్టం కూడా సంభవించింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చెలరేగిన ఘర్షణలు మణిపుర్‌లో హింసకు దారితీశాయి. ఫలితంగా 60 మంది మృతి చెందారు. 30 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అందులో 26 వేల మందిని సురక్షితంగా ఇతర జిల్లాలకు తరలించారు అధికారులు. మరి అక్కడ జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన దృశ్యాలను చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.