Man Shot Dead in Idukki: కేరళలో కాల్పుల కలకలం రేగింది. ఇడుక్కి జిల్లాలోని మూలమట్టం ప్రాంతంలో ఫిలిప్ మార్టిన్ అనే వ్యక్తి.. కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి 10 గంటలకు అశోక్ జంక్షన్‌లోని ఓ ఫుడ్ కార్ట్‌కు వెళ్లిన ఫిలిప్.. అక్కడే ఉన్న సనల్ సాబు అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. వెంటనే తన కారులో ఉన్న ఆయుధాన్ని తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.
Kerala crime news: దీంతో వెంటనే అక్కడి నుంచి పరార్ అయ్యాడు మార్టిన్. ఘటాస్థలి నుంచి తన కారులో తోడుపుళ వైపు పారిపోయాడు. అదే సమయంలో ఫుడ్ కార్ట్‌లో ఉన్న సనాల్ సాబు, ప్రదీప్ అనే మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్లిపోయాడు. కాగా, మార్టిన్, సనాల్ మళ్లీ ఎదురుపడ్డారు. మరోసారి ఘర్షణకు దిగారు. దీంతో మార్టిన్ తన తుపాకీతో మళ్లీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సనాల్ ప్రాణాలు కోల్పోగా.. ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుడు సనాల్.. కీరితోడె ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు బస్ ఉద్యోగి అని చెప్పారు. ప్రదీప్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. అతడికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. నిందితుడు మార్టిన్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ ముమ్మరం చేశామని పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు