కేరళలోని పాలక్కడ్ జిల్లా నెమ్మర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత ప్రేమకథ వెలుగు చూసింది. 2010 ఫిబ్రవరిలో ఓ టీనేజీ అమ్మాయి(18) ఇంటి నుంచి పారిపోయింది. అయిరూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పదేళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. పదేళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏమిటంటే.. పుట్టింటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటోంది. ఇందులో మరో విశేషం చెప్పాలంటే.. ఆమె అక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియదట.
బయటి నుంచి తాళం వేసి..
పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె నివసిస్తోంది. ఆమె ప్రేమికుడిగా చెబుతున్న యువకుడే యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూం కూడా లేదు. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా రాత్రిపూట ఆమె బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. పగటిపూట ఆ కిటికీ మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలు అన్నీ అతడే సమకూర్చేవాడు. తర్వాత బయటి నుంచి తాళం వేసేవాడు. పదేళ్లు ఇలాగే గడిచాయి.
అదృశ్యమైనది ఒకరే కాదు..
మూడు నెలల కిందట.. ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా జరుగున్న తతంగంతోపాటు అదృశ్యమైనది ఒకరు కాదు.. ప్రేమికులిద్దరూ అని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని కుగ్రామం విథాన్స్సెరీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్లు కోర్టుకు యువతి తెలపగా.. ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు.
ఇదీ చూడండి: తండ్రి వారించినా.. పట్టుదలతో సీజేఐకు లేఖ
ఇదీ చూడండి: ఆ గ్రామంలో ఇళ్లన్నీ అమ్మకానికే!