ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్నతండ్రే కక్షగట్టాడు. కూతురు తన మాట జవదాటిందని కర్కశత్వం ప్రదర్శించాడు. బిడ్డ సంతోషం కన్నా తన పరువుప్రతిష్ఠలే గొప్పవని భావించాడు. పెళ్లి చేసుకుని తిరిగొచ్చిన బిడ్డను కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని తెనకాశీ జిల్లాలో జరిగింది.
ప్రియుడితో పెళ్లి..
జిల్లాలోని అలంగుళమ్ పట్టణంలో మరిముత్తు(45) నివసిస్తున్నాడు. అతనికి షాలొమ్ షీబ(19) అనే కూతురు ఉంది. ఆమె ముత్తురాజ్ (22) అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు షీబ తల్లితండ్రులు ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి ఇద్దరూ ఒక్కటయ్యారు. అలంగుళమ్ పట్టణం పక్కనే ఉన్న కవలకుర్చి అనే గ్రామంలో కొత్త జీవతం ప్రారంభించారు. పెళ్లయిన ఆరు నెలల వరకు పుట్టింటికి రాలేదు షీబ.
'మళ్లీ ఎందుకొచ్చావ్?'
తల్లితండ్రులను చూడాలనిపించి ఆరు నెలల తర్వాత పుట్టింటి గడప తొక్కింది షీబ. ఇంటికి వచ్చిన కన్న కూతుర్ని చూడగానే 'మళ్లీ ఎందుకొచ్చావ్?' అంటూ ఆమె తండ్రి మరిముత్తు మహోగ్రుడయ్యాడు. వాగ్వాదానికి దిగాడు. తీవ్రమైన కోపంతో కూతుర్ని కత్తితో పొడిచి పారిపోయాడు.
తీవ్రంగా గాయాలపాలైన షీబను స్థానికులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. నిందితుడు మరిముత్తుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.