Man found alive after 12 years: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి మళ్లీ బతకుతాడా? ఇలాంటివి సినిమాల్లోనో, ఫిక్షన్ నవలల్లోనే సాధ్యం. కానీ, బిహార్లోని బక్సర్ జిల్లాలో ఈ తరహా సంఘటన నిజంగానే జరిగింది. 12 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి జాడ ఇప్పుడు తెలిసింది.
Bihar Buxar News: బక్సర్ జిల్లా ఖిలాఫత్పుర్ గ్రామానికి చెందిన ఛావీ ముశాహర్... 12 ఏళ్ల క్రితం వరకు తన భార్య, బిడ్డ, తల్లిదండ్రులతో తమ గ్రామంలోనే నివిసిస్తూ ఉండేవాడు. కానీ, అనూహ్యంగా ఓ రోజు అతడు తమ కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయాడు. ఛావీ ఆచూకీ కోసం అతని తల్లిదండ్రులు, భార్య ఎంతగానో వెతికారు. కానీ, ఎంత వెతికినా వారికి అతడి జాడ దొరకలేదు. ఇక ఛావీ చనిపోయాడని భావించి.. అతడికి అంత్యక్రియలు నిర్వహించారు అతని కుటుంబ సభ్యులు.
Buxer Man In Pakistan jail: అతని భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని, తన బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. ఛావీ ముశాహర్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే... ఇప్పుడు తమ కుమారుడు పాకిస్థాన్లోని ఓ జైలులో బందీగా బతికే ఉన్నాడనే వార్త వారికి తెలిసింది. దాంతో ఆ తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.
ఎలా తెలిసిందంటే..?
భారత విదేశాంగ శాఖ నుంచి పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాలని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఓ లేఖ అందింది. దాంతో వారు ఖిలాఫతాపుర్ దళితవాడకు చేరుకుని అక్కడ ఫొటో పట్టుకుని ఆరా తీశారు. దాంతో అది 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్గా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు.
"ఛావీ ఓ రోజు ఆకస్మాత్తుగా అతడు అదృశ్యమైపోయాడు. అతడే తిరిగి వస్తాడులే అని మేం అనుకున్నాం. ఎందుకంటే.. తరుచూ అతడికి ఇంటి నుంచి అలా వెళ్లి తిరిగి రావడం అలవాటు. కానీ, అప్పుడు మాత్రం చాలా రోజులు గడిచినా.. ఆతడు ఇంటికి తిరిగి రాలేదు. మేం అతడి కోసం చాలా వెతికాం. కానీ, మాకు ఎలాంటి సమాచారం దొరకలేదు. దాంతో మేం అతడు చనిపోయాడని భావించాం. అతడికి అంత్యక్రియలు కూడా నిర్వహించాం. రెండేళ్ల తర్వాత అతడి భార్య మరొకరిని వివాహం చేసుకుని, తన పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది."
-ఛావీ ముశాహర్ కుటుంబ సభ్యులు
"ముశాహర్ ఫొటోతో మేం దళితవాడకు చేరుకున్నాం. అతడి కుటుంబ సభ్యులను కలిశాం. ఆ ఫొటోను చూసి, అతడు తమవాడేనని వాళ్లు గుర్తుపట్టారు. దీనిపై మేం సంబంధిత శాఖకు తెలియజేశాం. మిగతా విషయాలు వాళ్లే చెబుతారు."
-అమిత్ కుమార్, ముఫాసిల్ ఎస్హెచ్ఓ
ఛావీ ముశాహర్ బతికే ఉన్నాడన్న వార్త తెలుసుకుని, అతని కుటుంబ సభ్యులతో పాటు దళితవాడ అంతా సంతోషంలో మునిగిపోయింది. ఛావీ రాకకోసం వారంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని వెంటనే తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇదీ చూడండి: CCTV Video: దొంగల బీభత్సం.. మహిళ ఫోన్ కొట్టేసి.. స్కూటీపై వేగంగా ఈడ్చుకెళ్లి..
ఇదీ చూడండి: తమ పొలంలోకి నీళ్లు రానివ్వొద్దన్నందుకు కాల్పులు- ఇద్దరు మృతి