మమతా బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. భాజపా మహామహులను సమర్థంగా ఎదుర్కొని.. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మమత.. దేశ ప్రజల చూపును మరోమారు ఆకర్షించారు. కేంద్రంలోని భాజపాను ఢీకొట్టే సత్తా తనకుందని నిరూపించుకున్నారు. దేశంలో అంతంత మాత్రంగా ఉన్న విపక్షానికి పెద్ద దిక్కుగా మారే అవకాశం ఇప్పుడు దీదీకి వచ్చింది. మరి ఇది నిజమవుతుందా? దేశ రాజకీయాలను దీదీ శాసించే రోజు వస్తుందా?
ఈ గెలుపుతో...
వాస్తవానికి.. 2021 బంగాల్ దంగల్‌లో మమత గెలవడం అంత చిన్న విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఆమె విజయతీరాలకు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, వంటి భాజపా దిగ్గజాలతో పోటీ పడి గెలుపును దక్కించుకున్నారు. సొంత పార్టీని ముందుండి నడిపిస్తూ.. భాజపాతో యుద్ధం చేశారు.
ఇదీ చూడండి:- కరోనాపై మోదీ సమీక్ష- నీట్ వాయిదాపై చర్చ!
ఈ లక్షణాలే మమతకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం తెచ్చిపెడుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం మమతకు ఉందని అంటున్నారు.
మమత సై...!
"కాలికి గాయం అయినా ఒంటికాలుతో బంగాల్లో విజయం సాధిస్తాం. రెండు కాళ్లతో దిల్లీ పీఠాన్ని అధిష్ఠిస్తాం"... ఎన్నికల వేళ మమత చేసిన వ్యాఖ్యలు ఇవి.
భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలన్న మమత లక్ష్యం వివిధ సందర్భాల్లో ఆమె మాటల ద్వారానే స్పష్టమైంది. ప్రధాని మోదీ, ఆయన విధానాలపై తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో.. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కొద్ది కాలంగా అంతగా ప్రభావం చూపటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం.. జాతీయ స్థాయిలో పాత్రపై టీఎంసీ నేత కలలకు ఊతమిచ్చింది.
నేతల మద్దతు...
ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వంటి కీలక నేతల మద్దతును కూడగట్టి భాజపాను ఎదుర్కొనేందుకు యత్నించారు మమత. బంగాల్ ఎన్నికల వేళ ఆమె కాలికి గాయమైనప్పుడు.. దాదాపు విపక్షాలన్నీ ఆమెకు మద్దతు ప్రకటించాయి కూడా.
ఈ పరిణామాలు.. మమతలో ఉత్తేజాన్ని నింపుతాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
ఇదీ చూడండి:- మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు