ఎనిమిది దశల బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి గురువారం తెరలేవనుంది. యావత్ దేశం ఎదురుచూస్తున్న 'మెగా వార్'కు నందిగ్రామ్ పోలింగ్ కేంద్రాలు సాక్ష్యంగా నిలవనున్నాయి. నాటి మిత్రులు- నేటి శత్రువులు... సీఎం మమతా బెనర్జీ- భాజపా నేత సువేందు అధికారి భవితవ్యాల్ని నందిగ్రామ్ ఓటర్లు గురువారం తేల్చనున్నారు. వీరి సమరంలో ఎవరు గెలిచినా అది చరిత్రే! ఓడితే మాత్రం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. మరి ఇంతటి కీలక పోరులో ప్రజలు ఎవరి పక్షం?
సువేందు షిఫ్ట్..
తొలినాళ్ల నుంచే.. బంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మమతకు నమ్మినబంటుగా, నందిగ్రామ్ ప్రజలకు అండగా నిలిచిన సువేందు అధికారి.. గతేడాది డిసెంబర్లో అనూహ్యంగా భాజపాలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు మమతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "దీదీ బేగంకు ఓటు వేయకండి.. మమతను గెలిపిస్తే బంగాల్ ఓ మినీ పాకిస్థాన్ అవుతుంది" అంటూ ప్రచారాలు హోరెత్తించారు. సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో ప్రజలు తనవైపే ఉన్నారని ధీమాతో ఉన్నారు.
ఇదీ చూడండి:- దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!
సువేందుకు మద్దతుగా.. భాజపా అగ్రనేతలు కదిలివచ్చారు. సువేందు తరఫున ప్రచారాలు నిర్వహించి తమ బలాన్ని చాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరకు బంగాల్‌కు తరలివెళ్లారు.
మమత సై
సువేందు అధికారి తిరుగుబాటు చేయడం వల్ల మమత కథ ముగిసిందని అనేక మంది భావించారు. కానీ అనూహ్య ప్రకటనతో అందరినీ షాక్‌కు గురిచేసి బంగాల్ రాజకీయాల వేడిని తారస్థాయికి తీసుకెళ్లారు దీదీ. సొంత నియోజకవర్గం భవానీపొర్ను విడిచి.. నందిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
ఇదీ చూడండి:- 'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?
ఆ రోజు నుంచి ఇప్పటివరకు.. పార్టీకి అన్ని తానై ముందుండి నడిపించారు మమత. అదే సమయంలో సువేందు అధికారి, భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
నందిగ్రామ్ వాసులు ఎటువైపు?
నందిగ్రామ్ పేరు వినగానే 2007లో నెలకొన్న సంఘటనలు గుర్తొస్తాయి. రైతుల భూములను తీసుకునేందుకు వామపక్ష ప్రభుత్వం వేసిన ప్రణాళికకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు మమత. ఆ సమయంలో ఆమె వెన్నంటే ఉన్నారు సువేందు.
సరిగ్గా 14ఏళ్ల తర్వాత.. మమత-సువేందు సమరం వల్ల మళ్లీ వార్తల్లో నిలిచింది నందిగ్రామ్. అయితే ఇక్కడ నందిగ్రామ్ ప్రజల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తమ ప్రియతమ నేతలు యుద్ధానికి దిగడం వల్ల ఆ ప్రాంతంలోని అనేక మంది.. 'ఎవరికి ఓటు వేయాలి?' అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. 'మమత ఇంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదని.. సువేందు అన్ని దగ్గరుండి చూసుకున్నారని.. మా ఓటు ఆయనకే' అని అనే వాళ్లూ ఉన్నారు. మరోవైపు.. 'ఏది ఏమైనా.. ఎన్ని పరిస్థితులు మారినా.. 2007లో తమను ముందుండి నడిపించిన దీదీనే గెలిపిస్తామ'ని ఇంకొందరు అంటున్నారు.
సీపీఎం అభ్యర్థి మీనాక్షి ముఖర్జీతో పాటు పలువురు స్వతంత్రులు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ.. దీదీ-సువేందు సమరంపైనే అందరి దృష్టి ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరి మమత-సువేందు మధ్య ఈ 'మెగా వార్'లో విజేతలుగా ఎవరు నిలుస్తారు? ప్రజలు ఎవరివైపు ఉంటారు? వంటి ప్రశ్నలకు సమాధానం మే 2న తెలిసిపోతుంది.
ఇదీ చూడండి:- 'చివరకు మిగిలేది మోదీ అబద్ధాల ఫ్యాక్టరీనే!'