భవానీపుర్ ఉపఎన్నికలో(Bhabanipur by poll) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విజయ ఢంకా మోగించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58, 832 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.
భవానీపుర్‌లో(Bhabanipur by poll) దీదీకి అసలు ఎదురే లేదని ఈ ఉప ఎన్నికతో మరోసారి నిరూపితమైంది. తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారు దీదీ. ఆ తర్వాత రౌండ్ రౌండ్‌కూ మెజారిటీ పెరుగుతూ వచ్చింది. తొలిరౌండ్ పూర్తయ్యే సరికి.. 3,680, రెండో రౌండ్ తర్వాత 3,861, నాలుగో రౌండ్ అనంతరం 12,435 మెజారిటీ సంపాదించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగింది. సెప్టెంబర్ 30న ఈ భవానీపుర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 53 శాతం పోలింగ్ నమోదైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో బంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్(Nandhigram assembly polls 2021) నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారి(Suvendhu Adhikari) చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మే 5న బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుంచి ఆరు నెలల్లోగా అనగా.. నవంబర్ 5వ తేదీలోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలతో పాటు మొత్తం మూడు స్థానాలకు సెప్టెంబర్ 30న కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకంగా మారిన భవానీపుర్ నుంచి మమతా బెనర్జీ పోటీలో నిలిచారు. అయితే, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి వీలుగా భవానీపుర్ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్‌కు మంచి పట్టుండడంతో దీదీ గెలుపు ఖాయమయ్యింది.
ప్రజలకు, ఈసీకి మమత కృతజ్ఞతలు..
తనకు ఓటు వేసి గెలిపించిన భవానీపుర్ ప్రజలకు, ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు మమత.
" భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 58,832 ఓట్ల తేడాతో గెలుపొందాను. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో విజయం నమోదు చేశాం. బంగాల్‌లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మనల్ని అధికారంలో నుంచి దించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. నా కాలికి గాయమైతే ఎన్నికల్లో పోటీ చేయని అనుకున్నారు. మాకు ఓటు వేసినందుకు ప్రజలకు, ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు. భవానీపుర్‌లో 46 శాతానికిపైగా ప్రజలు బెంగలీలు కాదు. వారంతా నాకోసం ఓటు వేశారు. భవానీపుర్ పరిస్థితులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
దీదీ ఇంటి వద్ద సంబరాలు..
భవానీపుర్‌లో భారీ ఆధిక్యంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపొందిన నేపథ్యంలో కోల్‌కతాలోని ఆమె నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీదీ దీదీ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మమత తన విజయోత్సహాన్ని పార్టీ శ్రేణులతో పంచుకోనున్నారు.
నాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: టిబ్రేవాల్
భవానీపుర్ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకే దక్కుతుందన్నారు భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్. 25వేలకుపైగా ఓట్లు సాధించినట్లు చెప్పారు. మమతపై తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మమతకు ఆమె అభినందనలు తెలిపారు.
" మమతా బెనర్జీకి మంచి పట్టున్న ప్రాంతంలో పోటీ చేసి.. 25వేలకుపైగా ఓట్లు సాధించాను. ఈ గేమ్‌లో నేనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాను. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడి పనిచేయటాన్ని కొనసాగిస్తాను. "
- ప్రియాంక టిబ్రెవాల్, భాజపా అభ్యర్థి.
'ఓడిపోయిన వ్యక్తి సీఎం కావటం ఎన్నడూ జరగలేదు'
బంగాల్‌లో భవానీపుర్ సహా మరో రెండు స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసింది భాజపా. ' బంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మా అంచనాలకు అనుగుణంగా రాలేదు. దానిని మేము అంగీకరిస్తున్నాం. మమతా బెనర్జీ ప్రస్తుతం భవానీపుర్‌లో గెలుపొంది ఉండవచ్చు, కానీ, ఓడిపోయిన అభ్యర్థి తనను తాను సీఎంగా ఎన్నికోవటం ఎన్నడూ జరగలేదు.' అని పేర్కొంది బంగాల్ భాజపా విభాగం.
టీఎంసీ విజయఢంకా..
భవానీపుర్తో పాటు ఉప ఎన్నికలు జరిగిన జంగీపుర్, సంసేర్గంజ్ స్థానాల్లోని విజయఢంకా మోగించింది అధికార తృణమూల్ కాంగ్రెస్. జంగీపుర్‌లో టీఎంసీ అభ్యర్థి జాకిర్ హస్సెయిన్ 92,480 ఓట్లు సాధించారు.
ఒడిశాలోని పిపిలి ఉప ఎన్నికల్లో అధికార బీజేడీ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహరథి.. ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి అష్రిత్ పట్నాయక్‌పై 20వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.