దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఆరు సలహాలను కూడా అందులో పేర్కొన్నారు.
"మహమ్మారి నియంత్రణపై చర్చించి, తగు చర్యలు తీసుకోవడానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలి. ఇది మనకున్న గొప్ప అవకాశం. నిపుణులు, సామాజిక కార్యకర్తల సలహాలు సిపార్సులను అమలు చేయాలి."
- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత
దేశంలో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత. అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బడ్జెట్లో టీకాలకు రూ.35,000 కోట్లను కేంద్రం కేటాయించినప్పటికీ.. టీకా ధర నిర్ణయం ప్రైవేటు సంస్థలకు వదిలేసిందని విమర్శించారు. అలాగే టీకాల కొనుగోలు రాష్ట్రాలకు అప్పజెప్పడం ద్వారా.. ప్రజల పట్ల కేంద్రం తన బాధ్యతను విరమించుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. మహమ్మారిని ప్రధాని కార్యాలయం ఒంటరిగా ఎదుర్కోలేదన్నారు.
పార్లమెంట్ ప్యానెల్ సమావేశాలు వర్చువల్గా
పార్లమెంట్ స్థాయీ సంఘాల వర్చువల్ సమావేశాలకు అనుమతించాలని కోరాయి విపక్షాలు. ఈ మేరకు రాజ్యసభ, లోక్సభ అధికారులకు లేఖ రాశారు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. సంక్షోభాన్ని ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని పేర్కన్నారు. వైరస్ నియంత్రణకు కొనసాగుతున్న ప్రయత్నాలకు పార్లమెంటరీ ప్యానెళ్లు దోహదపడతాయని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇదే విషయమై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్.
ఇదీ చూడండి: 'దేశానికి ఆక్సిజన్ అవసరం.. ప్రధానికి ఇల్లు కాదు'