కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించారు ఖర్గే. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు అందజేశారు పార్టీ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ మధుసూధన్ మిస్త్రీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. ఇది తనకు భావోద్వేగంతో కూడిన క్షణమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. దేశంలో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు. 'ప్రస్తుతం ఉన్న విద్వేషాన్ని, అబద్ధపు సంకెళ్లను కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది. 50ఏళ్ల లోపు నేతలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్న ఉదయ్‌పుర్ డిక్లరేషన్‌లోని ప్రతిపాదనను అమలు చేస్తాం' అని ఖర్గే పేర్కొన్నారు.
'ఉపశమనంగా ఉంది'
కాంగ్రెస్‌కు అనుభవజ్ఞుడైన నాయకుడు అధ్యక్షుడిగా రావడం తనకు సంతృప్తినిచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్ష పదవి అందుకునే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నా సామర్థ్యం మేరకు కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. ఈ బాధ్యతల నుంచి వైదొలగుతున్నందున కాస్త ఉపశమనంగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. పూర్తి ఐకమత్యంతో మేం ఈ సవాళ్లను అధిగమిస్తాం' అని సోనియా అన్నారు.
అంతకుముందు ఖర్గే మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఉదయమే రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన.. బాపూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం శాంతివన్, శక్తిస్థల్లను సందర్శించిన ఖర్గే.. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలకు నివాళులు అర్పించారు.
అక్టోబర్ 19న వెలువడిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఖర్గే ఘన విజయం సాధించారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా అడుగుపెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే.. తన ప్రత్యర్థి శశిథరూర్‌పై భారీ ఆధిక్యంతో గెలిచారు. తద్వారా 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ఖర్గే ముందున్న సవాళ్లెన్నో..
కాంగ్రెస్ పార్టీ నూతన సారథిగా పగ్గాలు చేపట్టబోతున్నమల్లికార్జున ఖర్గేకు మున్ముందు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు ఆయనకు తొలి పరీక్షగా నిలవబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీకి పెద్దగా విజయావకాశాలు ఇప్పటికైతే కనిపించట్లేదు. రాజస్థాన్, కర్ణాటకల్లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లే నేర్పు ఖర్గేలో ఉన్నా, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాల్లో ఐక్యత సాధించడం మాత్రం పెద్ద సవాలే.
దేశంలో ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో 2023లో తన సొంత రాష్ట్రమైన కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యత ఖర్గేపైనే పడనుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఖర్గేని రిమోట్‌తో నియంత్రించేది సోనియాగాంధీ కుటుంబమేనని వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా పనిచేయడం మరో ఎత్తు.