Mahua Moitra Hiranandani : పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త, తన స్నేహితుడు దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అంగీకరించారు. లోక్‌సభలో అడిగే ప్రశ్నలు టైప్ చేయడానికి ఇచ్చినట్లు.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను.. మహువా తోసిపుచ్చారు. లాగిన్ వివరాలు ఇతరులకు ఇవ్వటాన్ని ఆమె సమర్థించుకున్నారు. మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఇతరులకు కూడా ఆ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు.
'లిప్‌స్టిక్, మేకప్ ఐటెమ్స్ తీసుకున్నా'
ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్‌సైట్లను నిర్వహించే NICకి.. దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని మహువా తెలిపారు. హీరానందాని తనకు స్నేహితుడని, తన పుట్టినరోజున ఒక స్కార్ఫ్, లిప్‌స్టిక్, మేకప్ ఐటెమ్స్‌ను అందుకున్నట్లు మహువా చెప్పారు. హీరానందాని తనకు ఏదైనా ఇచ్చి ఉంటే.. ఆ వివరాలు వెల్లడించాలని కోరారు. అఫిడవిట్‌లో తనకు 2కోట్లు ఇచ్చినట్లు లేదని, ఒకవేళ నగదు ఇస్తే.. ఆ తేదీ, అందుకు సంబంధించిన పత్రాలు బయటపెట్టాలని.. మహువా డిమాండ్ చేశారు.
'విచారణకు రాలేను..'
మరోవైపు వచ్చేనెల రెండో తేదీన విచారణకు హాజరుకావాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను కోరింది. మరోసారి గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ మహువాపై ఆరోపణలు రావటం వల్ల.. ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఆమెపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఈనెల 31న విచారణకు హాజరుకావాలని ఎథిక్స్ కమిటీ ఆమెకు సమన్లు జారీచేసింది.
ఈక్రమంలో తాను ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఈనెల 31న విచారణకు హాజరుకాలేనని టీఎంసీ ఎంపీ శుక్రవారం లేఖ రాయటం వల్ల.. ఎథిక్స్ కమిటీ మరో 3రోజులు గడువు పొడిగించింది. నవంబర్ రెండో తేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది. అయితే శుక్రవారం రాసిన లేఖలో నవంబర్ నాల్గో తేదీ వరకు తాను బిజీగా ఉండనున్నట్లు మహువా పేర్కొన్నారు. ఐదో తేదీ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానంటూ సంసిద్ధత వ్యక్తంచేశారు. అయితే ఎథిక్స్ కమిటీ కొత్తగా సూచించిన నవంబర్ రెండో తేదీన కూడా టీఎంసీ ఎంపీ మహువా విచారణకు హాజరయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది.
'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'