ఏ పండగైనా ముందుగా గుర్తొచ్చే వాటిల్లో స్వీట్లు కచ్చితంగా ఉంటాయి. అయితే దంతేరాస్ నాడు ప్రజలు స్వీట్లతో పాటు బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు. తాజాగా ఈ రెండింటినీ ఒకే చోటకు తీసుకొచ్చింది మహారాష్ట్రలోని ఓ మిఠాయి దుకాణం. ఈ షాప్.. 24 క్యారెట్ల బంగారు పూతతో అలంకరించిన ఓ ప్రత్యేక మిఠాయి.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
'సోనేరి భోగ్'
అమరావతిలోని రఘువీర్ స్వీట్ షాప్ ఈ ప్రత్యేక మిఠాయిలకు వేదికైంది. 'సోనేరి భోగ్'గా పిలిచే ఈ లగ్జరీ స్వీట్లను 24క్యారెట్ల బంగారు పూతతో ప్రత్యేకంగా అలంకరించారు నిర్వాహకులు. అందువల్లే కిలో మిఠాయిని రూ.7000గా విక్రయిస్తున్నట్టు తెలిపారు షాప్ యజమాని తేజస్ పోపత్.
"గతేడాది దీపావళికి బంగారు పూత పూసిన 'పిస్తా పాన్'తో ముందుకు వచ్చాం. ఈ సీజన్ సందర్భంగా మరో అడుగు ముందుకేసి.. 24 క్యారెట్ల బంగారుపూతతో కూడిన 'సోనేరి భోగ్' మిఠాయిలను తయారు చేశాం."
- తేజస్ పోపత్, రఘువీర్ స్వీట్ షాప్ యజమాని
ఈ లగ్జరీ మిఠాయిల తయారీలో బాదం, పిస్తా, హేజిల్నట్, కుంకుమ పువ్వులను వాడినట్టు పేర్కొన్నారు తేజస్. ఇక మరింత ప్రత్యేకతను చాటుకునేందుకు స్వచ్ఛమైన పసిడి పూతను పూసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా.. 'సోనేరీ భోగ్' స్వీట్ కొనుగోలుదారులకు బంగారం స్వచ్ఛతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, గ్రీటింగ్‌కార్డులను కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు షాప్ యజమాని.
తగ్గని గిరాకీ..
ఇంతటి భారీ ధర నిర్ణయించినప్పటికీ.. సోనేరి భోగ్ స్వీట్లను కొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు వినియోగదారులు.
"నేను ప్రతి ఏడాది ఈ షాప్‌లో స్వీట్లు కొంటాను. వారు ప్రతి సంవత్సరం కొత్తదనం కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ షాప్‌లో లభించే ఏ స్వీట్ అయినా చాలా బావుంటుంది. అందువల్లే నా కుటుంబం కోసం ఈ సోనేరి భోగ్‌లను కొనుగోలు చేస్తున్నాను."
- కొనుగోలుదారుడు
'సోనేరి భోగ్' మిఠాయిల కోసం ముంబయి, పుణె, నాగ్‌పుర్ వంటి ప్రముఖ నగరాల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తున్నాయట.
ఇదీ చదవండి: నాజిర్ బేగ్.. ఓ నయా ఆదిమానవ్