Maharashtra politics latest: శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన నేత ఏక్‌నాథ్ శిందే అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసంగించిన అనంతరం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం అసహజమైన కూటమి నుంచి బయటపడటం అవసరమని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు, పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం సమావేశానికి రావాలని శివసేన జారీ చేసిన అల్టిమేటంపై స్పందించిన శిందే.. అవి చట్టపరంగా చెల్లవని పేర్కొన్నారు. 'శివసేన శాసనసభా పక్ష చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే భరత్ గొగవాలే కొత్తగా నియమితులయ్యారు. అందువల్ల సునిల్ ప్రభు ఇచ్చిన ఆదేశాలు చెల్లవు' అని శిందే ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ శిందే వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురు స్వతంత్రులతో కలిపి 34మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు నిలవగా.. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్డ్ విమానంలో గువాహటికి చేరుకున్నట్టు సమాచారం.
శాసనసభాపక్ష నేతగా శిందేనే..
ఠాక్రే సర్కారుపై శిందే తిరుగుబాటు చేయగానే ఆయనను శివసేన శాసనసభాపక్ష నేత హోదా నుంచి పార్టీ తప్పించింది. అయితే, రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనే తమ శాసనసభ నేతగా పేర్కొంటూ తీర్మానం చేశారు. "ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేం తిరుగుబాటు చేస్తున్నాం. అయితే అసెంబ్లీలోనే శివసేన పార్టీ అంటే మాదే. అందుకే ఏక్‌నాథ్ శిందేనే శివసేన శాసనసభాపక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. పార్టీ చీఫ్ విప్‌గా సునిల్ ప్రభు స్థానంలో భరత్ గొగవాలేను నియమించుకున్నాం" అని రెబల్స్ పేర్కొన్నారు. ఈ తీర్మానంపై 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ వీరు గవర్నర్‌కు, డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు.
శిందేతో మేం మాట్లాడలేదు: భాజపా నేత దాన్వే
శివసేన ఎమ్మెల్యేలెవరూ తమతో టచ్‌లో లేరని భాజపా నేత రావు సాహెబ్ పాటిల్ దన్వే తెలిపారు. ఏక్‌నాథ్ శిందేతో తాము మాట్లాడలేదన్నారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమని.. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు.
మరోవైపు, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు భాజపా డబ్బు, దర్యాప్తు సంస్థలను వినియోగించడమే పెద్ద సమస్యగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. మహారాష్ట్రలో సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. "ఇది శివసేన అంతర్గత సమస్య. ఆ పార్టీ నాయకత్వం దీన్ని సులువుగా పరిష్కరించగలదు. కానీ ఇక్కడ భాజపా తీరుతోనే పెద్ద సమస్య. ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు డబ్బును, దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోంది. శివసేన మనుగడ సాగిస్తుందని భావిస్తున్నా" అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: