మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు 7 పాయింట్ల కార్యచరణ ప్రణాళికను రూపొందించింది ఆరోగ్యశాఖ. కొవిడ్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారికి టెస్టులు చేయడం, వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, వైరస్ హాట్స్పాట్ కేంద్రాల్లో పెద్దఎత్తున పరీక్షలు చేయడం, మరణాలను పర్యవేక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి.
మార్చి 3న ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్.. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశించారు. సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాల్లో తప్పనిసరిగా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్యచరణలో పేర్కొన్నారు.
ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నాగ్పూర్,అమరావతి, యావత్మల్, ఠాణె, పుణె, ముంబయిలను కేంద్ర ఆరోగ్య శాఖ బృందం ఇటీవల సందర్శించిన నేపథ్యంలో.. ప్రణాళికలను రూపొందించారు.
'మహా శివరాత్రి' ఆంక్షలు..
కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా.. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో జనాలు గుమిగూడటాన్ని నిషేధించింది ప్రభుత్వం. వేడుకల్లో భాగంగా ఎక్కడా 50 మందికిపైగా సమావేశం కాకూడదని పేర్కొంటూ నూతన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఆలయ ప్రాంగణాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం సహా భక్తులు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలని నిర్వహకులకు సూచించింది.
ఇదీ చదవండి: రాజధానిలో రామరాజ్యమే నా కల: కేజ్రీవాల్