Madiga Social Justice Conference at Vijayawada: నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ మాట్లాడే సీఎం జగన్ సామాజిక న్యాయానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు, ఎస్సీలకు తానొచ్చాకే న్యాయం జరిగిందన్నట్లు చెబుతుంటారు. కానీ, చేతల్లో అదే ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 9 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఏడింటిని మాలలకు, రెండు మాదిగలకు కేటాయించారు. అనంతపురం జిల్లా మడకశిర, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గాల్లో మాదిగలకు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, సుధాకర్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అన్న స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 29ఎస్సీ రిజర్వుడు స్థానాలుంటే గత ఎన్నికల్లో 28 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. కానీ వారిలో 20మంది ఎమ్మెల్యేలు మాలలైతే, మాదిగలు 8 మందే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ను అమలులో కూడా ఒక వర్గానికి ప్రాధాన్యం, మరో వర్గానికి అప్రాధాన్యమిస్తూ ఏం సమన్యాయం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీఇంఛార్జ్‌ల మార్పులు - కొనసాగుతున్న మూకుమ్మడి రాజీనామాస్త్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 29 ఎస్సీ రిజర్వుడు స్థానాలుంటే వాటిలో 28 మంది వైఎస్సార్సీపీ నుంచే ఎమ్మెల్యేలున్నారు. కానీ వారిలో 20 మంది మాల వర్గం వారైతే, మాదిగ వర్గం నుంచి 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలోనూ మడకశిర, కోడుమూడు ఎమ్మెల్యేల టికెట్ విషయంలో స్పష్టత లేకపోయింది. మంత్రి సురేష్ విషయానికొస్తే ఆయన్ను 2014 సంతనూతలపాడు, 2019లో యర్రగొండపాలెంలో పోటీ చేయించారు. ప్రస్తుతం మంత్రిగా తన సొంత నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో కొండపిలో పోటీ చేయాలని అక్కడకి మార్చారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు.
దళితులు, గిరిజనులపై పెరుగుతున్న దాడులు - ఎక్కువశాతం నిందితులు వైసీపీ నేతలే
ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగ తరపున గురువారం విజయవాడలో మాదిగ సామాజిక న్యాయసదస్సు నిర్వహించారు. జనాభా ప్రాతిపదికనైనా మాకు న్యాయం చేయరా? అంటూ ఈ సదస్సులో పలువురు అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమలో రెండు ఎస్సీ రిజర్వుడు లోక్ సభ నియోజకవర్గాల్లో మాదిగలకు ఒక్కటీ కేటాయించలేదు. మాదిగలు అధికంగా ఉన్న మెట్ట ప్రాంతాల్లోనూ మాలలకే టికెట్లు ఇస్తున్నారు. శింగనమల, నందికొట్కూరు లాంటి నియోజకవర్గాల్లో మాదిగలే ఎక్కువ. కానీ, అక్కడ ఎమ్మెల్యే టికెట్లు మాలలకే ఇచ్చారని కొందరు నాయకులు విమర్శించారు.
'వైసీపీ పాలనలో దళితులపై దాడులకు అంతులేదా? ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయం'
గురువారం నాటి సదస్సుకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నా ఆయన రాలేదు. 3గంటలు చూసినా ఆయన రాకపోవడంతో నాయకులు సభను ముగించేసి వెళ్లిపోయారు. ఇటీవల తాడేపల్లిలో నిర్వహించిన ఓ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. అయితే ఆ సమావేశాన్ని మాల ప్రతినిధులే లీడ్ చేశారు. ఆ సభకు వెళ్లిన సజ్జల దీనికి రాకపోవడంపై మాదిగ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన ఎంపీ నందిగం సురేష్ వక్తల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.