మద్యం అక్రమ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. పోలీసులకు చిక్కకుండా వినూత్న రీతుల్లో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు అక్రమార్కులు. చేతిపంపు కొడితే నాటుసారా వస్తున్నట్లు మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని పోలీసులు గుర్తించగా.. తాజాగా నదిలో మద్యం బాటిళ్లు దాచిపెట్టి పోలీసుల కళ్లుగప్పుతున్న ఉదంతం బయటపడింది.రీవా జిల్లాలోని కొందరు అక్రమార్కులు ఇలా నాటుసారా సీసాలను నదుల్లో దాచిపెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఛక్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోంక్ గ్రామంలో అక్రమ లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సోదాలు చేపట్టారు. గ్రామానికి చెందిన సత్యదేవ్ సింగ్ అనే వ్యక్తిని విచారించారు. అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా.. ఎలాంటి సారా లభించలేదు. దీంతో స్థానికులను ఆరా తీయగా.. స్థానిక తామస్ నదిలో లిక్కర్ సీసాలను దాస్తున్నారని తెలిసింది. ఇది విని పోలీసులే అవాక్కయ్యారు. నిజమో, కాదో తెలుసుకునేందుకు నదిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పడవలో నది మధ్యలోకి వెళ్లి పరిశీలించగా.. 20 మీటర్ల లోతులో లిక్కర్‌తో నింపిన సీసాలు బయటపడ్డాయి. మొత్తం 13 లీటర్ల సారా సీసాలను నీటి లోపలి నుంచి బయటకు తీశారు పోలీసులు. నిందితులు సారా తయారు చేసి నదిలో దాచిపెడుతున్నారని పోలీసులు తెలిపారు. కస్టమర్లు రాగానే.. పడవలో నదిలోకి వచ్చి సీసాలు బయటకు తీసి విక్రయిస్తున్నారని చెప్పారు.
కాగా, బుధవారం ఇదే రాష్ట్రంలోని గునా జిల్లాలో చేతి పంపు కొడితే నాటుసారా వస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భన్‌పుర అనే గ్రామంలో నాటుసారా మాఫియా ఈ మేరకు చేసుకున్న ఏర్పాట్లను పోలీసులు గుర్తించారు. నిందితులు.. నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.